శంఖంలో ఓంకార శబ్దం
సముద్రంలో దొరికే శంఖాలు వివిధ రూపాలలో లభిస్తుంటవి. దానిలో వుండే పురుగుయొక్క శరీర నిర్మాణాన్ననుసరించి శంఖంరూపురేఖలు మారుతుండగనవు. కొందరు అవివేకులు కొన్ని శంఖాలలో ఓం అనే శబ్దం వినవస్తుందని, అది ఉత్తమమైనదిగా భావించి ఎక్కువ ఖరీదుకు కొనుగోలు చేసి దాన్ని పూజ్యభావంతో చూస్తుంటారు.
ఏ శంఖానికైనా గర్బానికి సంబంధం కలిగేటట్లుగా రెండు మూడు అతిసన్నని రంధ్రాల నేర్పరచి ఆ శంఖాన్ని గాలి వాటంలో చెవి దగ్గర పెట్టుకుంటే రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన గాలి ప్రతిధ్వనించి, ఒక విధమైన శబ్దం చెవులకు సోకుతుంది. దాన్నే ప్రణవనాదం అని నమ్ముతుంటారు తెలీనివాళ్ళు. వీరి బలహీనతను గుర్తించి కొందరు శంఖాల వ్యాపారంలో అధిక లాభాలార్జిస్తున్నారు.
కొబ్బరికాయ కొడితే పరిమళాలు
బాబాలు మంత్రించి ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి పగలగొడితే పరిమళగంధాలు ఇల్లంతా వ్యాపించటం; ఇంకేముంది బాబాగారి మహాత్మ్యానికా ఇంటిలోని వారేగాక ఇరుగు పొరుగు వారు కూడా దాసోహమనటం నేటి రోజులలో పరిపాటి అయిపోయింది. ఇంద్రజాలం ప్రదర్శించే వారు కూడా ఈ ప్రయోగం చేసి చూపవచ్చు.