ఏదయినా కాగితంగాని, గుడ్డ గాని ఇవ్వమని అడిగి తీసుకొని తను స్టేజిమీద గుర్తుగా వుంచుకొన్న ప్రదేశంలో వారిచ్చిన కాగితాన్ని కాల్చి, ఆ బూడిదను వారికి పంచిన - ఆ బూడిదకు సెంటు వాసన వచ్చి వారికి మితి మీరిన ఆనందం కలిగి ఉత్తేజ పడతారు.
1) ప్రదర్శించు వారు ముందుగా స్టేజిమీద తనకు అనుకూలమయిన ప్రదేశములో సెంటును పోసి ఆ ప్రదేశంలో వారిచ్చిన కాగితాన్ని కాల్చాలి.
2)లేదా- కాళీ మందు గొట్టాము (ఎమ్టి మెడిసన్ క్యాప్సూల్) లోపల సెంటును నింపి - ప్రదర్శన సమయములో (కాగితాన్ని కాల్చునపుడు ఆ మంటలో చాక చక్యంగా ఆ గొట్టాన్ని వెయ్యవలెను) దాన్ని వినియోగించాలి.
నీటిలో పన్నీటి ఘుమ ఘుమలు
ప్రదర్శకుడు తనను చూచు వారితో - తన దివ్యమయిన మంత్ర మహిమతో నీళ్ళను కూడ పన్నీరుగా మారుస్తానని చెప్పి - మంత్రించిన (అలా నటించి) విభూతిని తీసి - పాత్రలో వున్న నీటిలో (పాత్రలో వున్న నీళ్ళను ప్రేక్షకుల చేతనే తెప్పించడము మంచిది. అలాగయిన వారికి అనుమానము రాదు) వేసి కలియ బెట్టాలి. (కలియ బెట్టడం - ఎంతో చాక చక్యముగా అనుమానము రాకుండా - జాగ్రత్త గా కలపాలి) ఇక ఆనీరు పన్నీటి వాసనలతో విరాజిల్లి చూచు వారు చాల ముచ్చట పడతారు.