ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

మహర్షుల చరిత్రలు


యుండి యందు నక్కియున్నను దనకు శివకోపమునఁ జావు తప్పదని భయపడిపోయి శరవేగమున శివునికడకే చేరి యాతనిహస్తమునఁ బ్రవేశించెను. ఉగ్రమూర్తి యగుశివుఁడు ఉశనసునిఁ జూచి కోపముతో మ్రింగివేసెను. శివునికడుపులో నుండి యిటునటు తిరుగుచు బయటఁ బడఁ దలఁచిన ఉశనసుని తలంపెఱింగి శివుఁడు తనదేహరంధ్రముల నన్నిఁటిని మూసివైచి తనమూత్రమార్గమును మాత్రము మూయ కుండెను. ఉశనసుఁ డిఁక గతిలేక శివునిమూత్ర ద్వారమునుండి బయట పడెను. అప్పుడును శివుఁ డాతని నింకను శిక్షింప హుంకరించెను. ఉశనసునియదృష్టవశమునఁ జెంత నున్న పార్వతి “దేవా! ఈతఁ డెట్టి వాఁడై నను నీకడుపునఁ బుట్టుటచే నాకుఁ గొడుకైనాఁడు. ఈతనితప్పు లన్నిఁటిని మన్నించి దయదలఁచి యీతనిని సుఖవంతు నొనర్పు" మని ప్రార్థించెను. ఆ సుందరీలలామవదనారవిందముఁ గనుసరికి నా మె మృదుమధుర శుకాలాపములు వినుసరికి శివుని కెక్కడికోప మక్కడకుఁ బోయెను. చిలుకలకొలుకు లగు కలుకులపలుకు లెవనికోపముఁ బాపలేవు ?

శివుఁ డప్పుడు ఉశనసునికి గొప్పతేజస్సు నిచ్చి పార్వతితో నిట్లనెను. “దేవీ! వీని యోగము గొప్పది. నీ దయ యీతనిపైఁ గలిగినది. నీ దయ నా దయ. నీ కోపము నా కోపము. నీప్రీతి నాప్రీతి. ఈతఁడు శుక్రరూపమున బయటపడుటచే నిఁక నీతఁడు శుక్రుఁ డను పేరఁ బరఁగును. ఉపరిమార్గమునుండి కాక అధోమార్గమునుండి వచ్చినవాఁ డగుట నీతఁడు సన్మార్గులకుఁగాక దుర్మార్గులగు రాక్షసులకు గురువయ్యెడు ” నని పలికి ఉశనసుని విడిచిపుచ్చి కుబేరుని నిధులు కుబేరునికిఁ జేర్చెను.

"సజ్జనులవలనికోపమైనను క్షేమదాయకమే. దుర్జనులవలని ప్రేమయైనను బ్రమాద హేతువే" అన్నవాక్యము ఉశనసునిపట్ల ధ్రువ మయ్యెను.*[1]

రాక్షసగురుత్వము

కాలక్రమమున రాక్షసరాజు లెల్లరు విచ్చేసి తమకులగురువై తమక్షేమము నరయుచుండు మని ఉశనసునిఁ బరిపరివిధములఁ బ్రార్థించిరి.

  1. *భారతము; శాంతిపర్వము.