ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

మహర్షుల చరిత్రలు


యుండఁగా నారదమహర్షి విచ్చేసి బృహస్పతితమ్ముఁడు మహాయోగియగు సంవర్తుని బిలిచి యజ్ఞ మొనరింపు మని సూచించి సంవర్తునిఁ గనుంగొను తీరు, ఆతనిని వశపఱచుకొను విధముఁ దెలిపి వెడలెను. మరుత్తుఁ డమితానంద మంది యటు లొనరించి సంవర్తుని బహుగౌరవముగాఁ దీసికొనివచ్చి యజ్ఞ మారంభించెను.

ఈ సంగతి తెలిసి యింద్రుఁ డసూయపడి యెట్లైన యజ్ఞవిఘ్నముఁ గావింపఁ దలఁచి బృహస్పతియే వచ్చి యజ్ఞము నడిపించు ననియు, సంవర్తునిఁ బంపివేయు మనియు మరుత్తునకు వార్తఁ బంపెను. మరుత్తుఁ డంగీకరింపఁ డాయెను. ఇంద్రుఁడు కోపించి వజ్రాయుధమును బంపెను. మరుత్తుఁడు సంవర్తుని శరణుచొచ్చెను. సంవర్తుఁడు వజ్రాయుధము నాపివేసి గాలిపటమువలె గిరగిరఁ దిరుగుచు నొక్కచో నుండిపోవ శాసించెను. అది నిర్వీర్యమై నిలిచిపోయెను. పిదప, నింద్రబృహస్పతులకు బుద్ధివచ్చి తాము స్వయముగా వచ్చి సంవర్తుని క్షమాభిక్షముఁ గోరిరి. సంవర్తుఁడు వారి నాదరించి మరుత్తునియజ్ఞమును నిర్విఘ్నముగను దివ్యముగను జరిపించెను. మరుత్తుఁడు వారిని బూజించెను. ఇంద్రబృహస్పతులు సంతోషించి వెడలిరి. *[1]

బృహస్పతి శనిపీడ నందినకథ

బృహస్పతి దయాళువై భూ జనులకు జ్ఞాన ముపదేశించి బాగుచేయఁ దలఁచి నర్మాదా నదీతీరమునఁ గల యొకపట్టణముఁ జేరి 'వాచస్పతి' యని తనవాఙ్ని పుణతకుఁ బేరువడసి, శిష్యప్రశిష్యులఁ జేరఁదీసి వారికి సమస్తసౌకర్యములు స్వశక్తివలన సమకూర్చుచు నుండెను. పెక్కురు జిజ్ఞాసువు లామహనీయుని శిష్యులై పెక్కు జ్ఞానరహస్యము లాతని వలన నెఱిఁగి సంతోషించుచుండిరి.

ఇట్లుండ, ఛాయాసూర్యతనయుఁ డగుశని తండ్రిని జేరి తనకు విద్యాబుద్ధులు గఱపువిబుధగురుఁ డెట నున్నాఁ డని ప్రశ్నించెను. సూర్యుఁడు "వత్సా! నీకు విద్యాబుద్ధులు గఱపఁ గలదిట్ట యొక్క బృహస్పతియే. ఆతఁ డిపుడు నర్మదాతీరమందలి నగరమున గురుకులా

  1. *భారతము. అశ్వమేధపర్వము