ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహస్పతిమహర్షి

55


తెలిపెను, “లోకములు, లోకధర్మములు రాజమూలములు. ఇంకిపోయిన చెఱువునందలి జలజంతువులగతి యేమగునో రాజరహిత మైన రాజ్యమందలి ప్రజలగతి యట్ల గును. ధర్మప్రభువుపాలన లేకపోవుచో, సూర్యచంద్రులు లేనపుడు దుష్టు లెన్ని పాపములకుఁ గడంగుదురో, యన్నిదురితములు రాజ్యమును నాశనము చేయును. రాజు లేని రాజ్యమున ధనతరుణీమానప్రాణములుఁ దక్కవు. రాజు లేనిచో సర్వము లేనట్లే . రా జున్నచో సర్వము నున్నట్లే. ప్రజలకు యాగభోగత్యాగములు ధర్మములు రా జున్నపుడే కొనసాగును. రాజు లేనపుడు రాగ రోగములే విహరించును. ఉత్తముఁ డగురాజు చారచక్షువై జగముఁ గనునపుడు సూర్యుఁడు, అకార్యకరులఁ దునుమునపుడు యముఁడు, సాధుసజ్జనులఁ బ్రోచునపుడు దేవతాత్మకుఁడు. అట్టి వానినిగుఱించియే సమ్రాట్టు, విరాట్టు అనుశబ్దములు పుట్టినవి. రాజునకుఁ బ్రజ శరీరము ప్రజలకు రాజు ఆత్మ; రక్షార్చనలందు ఉభయులు అన్యోన్య విరాజితులై నపుడు రాజ్యము శోభించును; లేనినాఁడు క్షోభించును.” *[1]

బృహస్పతి మాంధాతకుఁ దెలిపిన గోప్రదానప్రభావము

తొల్లి యొకప్పుడు మాంధాత యనుమహాచక్రవర్తి చక్కగ మేసి నీరు త్రావి మందలో నమందానందమునఁ బరుండియున్న గోవుల కడకు వచ్చి, ప్రదక్షిణించి, నమస్కరించి, పరమ భక్తితో బృహస్పతిని దలంచి కరకమలములు మొగిచి బహువిధములఁ బ్రస్తుతించి ధ్యానించెను. వెంటనే బృహస్పతి యాతని యెదుటఁ బ్రత్యక్షమయ్యెను. మాంధాత మహాభ క్తి నాతనిపాదములకు మొక్కి గోప్రదానవిధానముఁ దెలుపు మని ప్రార్థించెను. బృహస్పతి కరుణించి యిట్లు తెలిపెను. “రాజేంద్రా! భూదేవతల యనుజ్జ నంది పుణ్యదినమున నుపవాసము చేసి గోవులున్న మందకేగి నియమనిష్ఠలతో నొకరాత్రి యొకపగలు నివసించి మఱునాఁ డుదయము గోవును పేరుపేరఁ బిలిచి బ్రహ్మ చెప్పిన "తల్లి గోవు, వృషము తండ్రి, గర్భప్రదేశము స్వర్గము, ధరణి సంప్రతిష్ఠ " అను వాక్యముఁ బలికి పిదప, తనపాపము లన్నియుఁ బోవు

  1. *భారతము, కొంతివర్వము.