ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

ధౌమ్యమహర్షి

తొల్లి ధర్మాత్ముఁడు, మహాతపశ్శాలి, పుణ్యచరిత్రుఁడు, వేద వేదాంగవేత్త, స్మృతికారుఁడునగు వ్యాఘ్రపాదుఁ డను మహర్షి యుండెను. ఆతనికి ధర్మపత్ని యం దిరువురు కుమారులు కలిగిరి. వారిలో మొదటి వాఁడు ఉపమన్యువు, రెండవవాఁడు ధౌమ్యుఁడు.*[1]

ఈ సోదరు లిరువురు బాల్యమునఁ దోడి ముని బాలురతో నాడుకొనుచు నొకమునియింటి కేగిరి. అక్కడ నొక యావును బాలు పితుకుట తొలిసారిగా వారు కాంచిరి. ఆ తెల్లనివేమని వారు తోడి బాలుర నడుగఁగా వా రవి ఆవు పా లనియుఁ జాల రుచికరములుగా నుండుననియు, అవి త్రావవచ్చు; వానితో క్షీరాన్నము చేసికొనవచ్చు. ఆ క్షీరాన్నము చాల బాగుండుననిచెప్పిరి. అది విన్న యా సోదరులకు క్షీరపాన, క్షీరాన్న భోజనకాంక్ష కలుగ వారింటికి వచ్చి తల్లిని బిలిచి "అమ్మా! మాకు క్షీరాన్నము పెట్టవే!” అని యడిగిరి.

అమాయకులగు బాలురను దల్లి కౌఁగిలించుకొని ముద్దుపెట్టుకొని వారి కోరిక దీర్పఁ దనయింటఁ బాలు లేమికి విచారించి, ఐనను బసిబిడ్డలమనస్సు నొప్పించుట కిష్టపడక, ఉపాయమూహించి యట్లే పెట్టెద నని వారి నూఱడించి మెత్తనిపిండి నీళ్ళలోఁ జిక్కగఁ గలిపి వారికి బెట్టెను. ఆ పసికందు లదియే క్షీరాన్నమనుకొని తిని మునిబాలు రన్నంత రుచికరము కాదు క్షీరాన్న మనుకొనిరి. కొన్నా ళ్లయిన పిదప, నొక నాఁడు బాలు రిరువురు తండ్రితోఁగూడ బంధువులింట యజ్ఞము జరుగు చుండ నచటికిఁ బోయిరి. అచట యజ్ఞకర్త వచ్చినవారి కతిమధురమగు పాయసాన్నము వడ్డించెను. భోజన వేళ నది తిని క్షీరాన్న మన్న నది యని వారు గ్రహించి మునిబాలురు చెప్పినది నిజమే యనియుఁ దమతల్లి పెట్టినది క్షీరాన్నము కాదనియు వారు నిశ్చయించుకొని

  1. *భారతము. అనుశాసనిక పర్వము. దేవలుని సోదరుఁడు ధౌమ్యుడని భారతాది పర్వమునఁ గలదు.