జైగీషవ్యమహర్షి
29
దేవలుఁడు జై గీషవ్యుని శిష్యుఁ డగుట
దేవలుఁడు మహాయోగి. తాను మహాయోగి నను నభిమానము కూడ నాతని కుండెను. ఐన నాతఁడు సత్యవ్రతులలో నుత్తముఁడు. మహాతపస్వి. బ్రహ్మనిష్ఠుఁడు నని మహాఖ్యాతిగాంచెను.
ఒకనాఁడు జై గీషవ్యుఁడు దేవలునింటికి విచ్చేసెను. దేవలుఁ డాతని కతిథిసత్కారము లొనరించి యాదరించెను. జై గీషవ్యుఁడు "అయ్యా ! నీవు మహాతపశ్శాలివి. నీ కడనుండి నేను ప్రశాంతముగాఁ దపము చేసికొనఁ దలఁపు కలిగి వచ్చితిని. నా కాశ్రయ మిచ్చెదవా?" అని యడిగెను. జై గీషవ్యునంతటి మహా యోగీశ్వరుఁడు తనకడ కరుదెంచి యాశ్రయము కోరుట నిజముగాఁ దనయాధిక్యమును గుర్తెఱింగియే యని భావించి దేవలుఁ డానందమున నందుల కంగీకరించెను. పిదప దేవలుఁడు జై గీషవ్యునికి వలయుసౌకర్యములను గల్పించి యాతఁ డందు మౌననిష్ఠ మహాతపస్వియైయుండ భోజనవేళ కాఁగానే పుష్పాదులఁ బూజించి ఫలాదుల నర్పించి యాతని నన్ని విధముల నాదరించుచు నుండెను.
ఇట్లు కొన్ని సంవత్సరములు గడచెను. జై గీషవ్యుఁడు మౌననిష్ఠ విడువక, ఉగ్రతపము సాగించుచు, ఉజ్జ్వలతేజమునఁ బ్రకాశించుచు దేవలుని నిందింపక, నందింపక, ఉలుకక, పలుకక, కలఁగక, అలుగక, కదలక, మెదలక, యుండెను. దేవలుఁడు తనయోగశక్తిని జై గిషవ్యునికిఁ జూపి యాతని మెప్పుపొందఁ దలఁచెను. ఒకనాఁ డాతఁడు జై గీషవ్యుఁడు చూచుచుండఁగనే యంతర్హితుఁడై సముద్రస్నాన కుతూహలుఁడై యొకపవిత్ర ప్రదేశమున దిగెను. అప్పటికప్పుడే యచట సముద్రస్నాన మాచరించి జపము చేసికొనుచు సికతాతలమునఁ గూర్చున్న జై గీషవ్వు నాతఁడు కాంచి తన కన్నులను దాను నమ్మలేక యాశ్చర్యభరితుఁడై తాను స్నానకృత్యమును నిర్వర్తించి యోగశక్తి నింటికి వచ్చి చేరెను. ఇంటియొద్ద యథాస్థానమున జై గీషవ్యుఁడు మౌననిష్ఠం గూర్చుండియే యుండుట దేపలుఁడు కాంచి ఆహా ! నేనే యోగశక్తి సంపన్నుఁడ నన్న యహంకారము పటాపంచలైనది.