ఈ పుట ఆమోదించబడ్డది

మహర్షుల చరిత్రలు

ఉదంకమహర్షి

భృగువంశమున జనించిన మహర్షులలో ఉదంకమహర్షి యొకడు. ఈతడు బాల్యమునుండి గౌతమమహర్షికడ శిష్యుడై గురుశుశ్రూషా తత్పరుడై యాతని సేవించుచుండెను. గౌతమునికడ శిష్యులుగ జేరిన యనేకులలో నీత డొకడు. అందరికన్న మిన్నగా గురునింటి పనులు శ్రద్ధతోను, భక్తితోను, ఓరిమితోను నీతడు చేయుచుండెను. ఇటు లుండ ననేకసంవత్సరములు గడచుచుండెను. గౌతముడు విద్యా పరిపూర్తి యైనశిష్యులను గ్రమక్రమముగా బిలుచుచు వారు వారు కోరినవరము లిచ్చి యాశీర్వదించి పంపుచుండెను. కాని, యెన్ని సంవత్సరము లైనను, ఉదంకునివలన సేవ కొనుటయే కాని యాతనిం బిలిచి యేమికావలయు నని యడుగుట కాని, విద్యాపరిపూర్తియనది; ఇక బోవచ్చునని కాని, యెన్నడును బలుకకుండెను. బాల్యమున శిష్యుడుగా జేరిన యుదంకునకు గుర్వాశ్రమముననే కౌమార యౌవనములు కడచి గురుశుశ్రూషలోనే వార్ధక్యము పైబడెను. ఐనను, నిత్య మాతడు అడవులలొని కేగి కట్టెలు కొట్టితెచ్చుట, గురుగృహిణి యగు అహల్యాసాధ్వికి దలలోనినాలుకవలె నుండి సమస్తగృహకృత్యములు నిర్వహించుచుండుట మానకుండెను.

ఆ దినములలోని గురుశిష్యసంబంధ మట్టిది. గురు సేవలో నిమగ్నులై శిష్యులు దేహస్మృతి యెరుగకుండెడివారు. ఉదంకు డెన్నడును తనవయస్సునుగురించి లెక్కించుకొనుట కాని, తనముఖ మెట్లున్నదని యద్దమును జూచుకొనుటకాని తా నిన్ని విద్యలు నేర్చినను గురువింకను వీడ్కో లీయడే యని యాతురత కనబరచుట కాని లేకుండెను. ఒకనాడు వనమున కేగి యెండుకట్టెలమోపు నెత్తిని బెట్టుకొని యింటికి వచ్చి క్రిందబడవేసెను. మోపు చాల పెద్ద దగుటచేతను, మిక్కిలి బరువగుటచేతను, అది క్రింద బడునపుడు ఉదంకునిజుట్టు కొంత కర్రలకు బెనగొని మోపుతోపా టదియు నేలబడెను. ఎండు కట్టెలను