పుట:Maharshula-Charitralu.firstpart.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

మహర్షుల చరిత్రలు


శైలాగ్రమునఁ బూజాపరతంత్రుఁడై యుండెను. ఒకనాఁ డటకుఁ గలశజుఁ డరుదెంచి నిలిచియుండెను. ఇంద్రద్యుమ్నుఁ డాతనిఁ గాంచియు నేమఱిపాటున నిర్లక్ష్యముగా నూరకుండెను. అగస్త్యుఁ డాతని నిర్లక్ష్యబుద్ధికి గినిసి యాతఁడు నీచగజయోనిం బుట్టుఁగా కని శాపోదకమును విడిచెను. ఇంద్రద్యుమ్నుఁ డప్పటి కొడ లెఱఁగిఁ భక్తి తాత్పర్యములతో నగస్త్యుని పాదములపైఁ బడి “మహాత్మా! నేను నిర్లక్ష్యబుద్ధితో లేను. ఈ శైలాగ్రభాగమున నుండి గృహీత మౌననియతితో సర్వాత్ముఁ డైన నారాయణు నూహించుచు దేహస్మృతి వీడి యుండుటచే నిన్నుఁ గనఁజాలకపోయితిని. అంతియకాని మఱియొక భావమున నున్న వాఁడను గాను. నన్నుఁ గరుణింపవే!" యని ప్రార్థించెను. అగస్త్యమహర్షి యు “నృపాగ్రణి ! నీ విషయము నే నెఱుఁగుదును, ఎట్టి పుణ్యాత్ములైనను విప్రులఁ గని యిచ్ఛా మూలమునఁ గాని పరేచ్చా కారణమునఁగాని యేమఱి గాని యవమానించి రేని యది దుష్కృతమే యగును. నీవు పుణ్యాత్ముఁడవు. నేఁటి విప్రావమానదోషము నిలిచియున్నచో ముందుముందు నీ కది ప్రమాద హేతు వగును. ఏతద్దోషపరిహరణార్థమై నీవు గజ జన్మము నెత్తక తప్పదు. ఇదియు విధివిలసితము. కాని, నీవు నారాయణ భక్తి వరిష్టుఁడవు, కనుక గజజన్మ మెత్తియు నీవు నారాయణచరణ సేవ నేమఱనికతముననే ముక్తి నందఁ గలవు పొ ”మ్మని కలశజుఁడు దనదారిఁబోయెను. ఇంద్రద్యుమ్నుఁడేనుఁగై పుట్టి యొక కాసారమున జలమును గ్రోలుతఱి నొక మకరముచేఁ బట్టువడి యితఃపర మెఱుఁగక విష్ణుమూర్తిని బ్రార్థింపగా నాతఁడు ప్రత్యక్షమై. శాపవిమోచనముఁ జేయ నాతఁడజ్ఞానరహితుఁడై విష్ణురూఁపుడై వెలసెను. ఈ గజేంద్రమోక్షమే శ్రీ మద్భాగవతమందలి గజేంద్రమోక్షణము:

అగస్త్యుఁడు మణిమంతుని శపించుట

తొల్లి యొకప్పుడు కుశవతి యను పుణ్యనదీతీరమున నమరులు: సత్రయాగము చేయుచుండిరి. దాని కాహుతుఁ డై కుబేరుఁడు పుష్పక