పుట:Maharshula-Charitralu.firstpart.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

మహర్షుల చరిత్రలు


అగస్త్యవ్యాసుల వృత్తాంతము

కాశీక్షేత్రమును శపింపఁబూనిన కారణమున వ్యాసుఁడు శిష్యసమేతుఁడై వారాణసీపురమునుండి విశ్వేశ్వరునిచేఁ ద్రోలి వేయఁబడి వచ్చుచుండఁగా లోపాముద్రాసహితుఁడగు నగస్త్యమహర్షి యాతని కెదురయ్యెను. ఆ ఋషిపుంగవు లొకరినొకరు కౌఁగిలించుకొని పరస్పరము కుశలప్రశ్నము లొనరించుకొనిరి. పిదప, సశిష్యులగువారు తుల్యభాగాతీరమునఁ గల బిల్వవనమునందలి చలువ రాతితిన్నెలపైఁ గూర్చుండి కొంతకాల మిష్టకథా వినోదములఁ బ్రొద్దు పుచ్చిరి. అనంతరము వ్యాసుఁడు కాశిఁ బాసి వచ్చుటకుఁ గారణ మేమని యగస్త్యుఁ డడుగఁగా నాతఁ డంతయుఁ బూసగ్రుచ్చినట్లు చెప్పి యన్నపూర్ణ యాజ్ఞ వలన దక్షిణ కాశి యగు దక్షారామమునకు విచ్చేసితి ననియు భీమేశ్వరుఁడు తన్నుఁగాపాడుఁగదా యని పలికెను. అగస్త్యుఁడు వ్యాసు నోదార్చి దక్షారామమహిమఁ 'దెలిపి వ్యాసుని కోరికపైఁ దన తపోమహత్త్వముచే నాకాశమున కెగయించి వ్యాసాదుల కగస్త్యుఁడు భీమమండలమును జూపి ఇంద్రేశము, సిద్దేశ్వరము, యోగీశము, కాలేశ్వరము, శమనేశము, వీరభద్రేశము, బ్రహ్మేశము. కపాలేశ్వరము, కుక్కుటేశము, సోమనాథేశ్వరము, శ్రీమహేశము, రామతీర్థము అను ద్వాదశ క్షేత్రములఁ దెలిపి వానినెల్ల వేర్వేఱ నిరూపించి దక్షాధ్వరానలము, అఖిలేష్ట సంసిద్ధి, సోమేశ్వరము, హైమవతము, సప్తగోదావరము అను పంచతీర్థములఁ బేర్కొని వానియందెల్ల వ్యాసు నోలలాడించెను. ఆ తరువాత నాతఁడు వ్యాసునితో భీమేశ్వరాలయముం బ్రవేశించి దాని మహత్త్వమును వేయినోళ్ళఁ దెలిపెను. వ్యాసుఁడు శివు నర్చించి బ్రహ్మానందమందెను, పిదప, అగస్త్యుఁడు సగౌరవముగా నాతని వీడ్కొని భార్యాసహితుఁడై తన యాశ్రమమునకు వెడలి సుఖముండెను.