పుట:Maharshula-Charitralu.firstpart.pdf/164

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

మహర్షుల చరిత్రలు


దుర్వాసుఁడు యోగమాయను వివాహమగుట

దుర్వాసోమహర్షి యొకనాఁడు పదునాఱువేలగోపికలను, అష్టమహిషీమణులను వివాహమైన శ్రీ కృష్ణునిఁ జూడ మనసుగలిగి ద్వారకకుఁ బయనమై పోయెను. ద్వారకానగరము నా మహర్షి సమీపించుసరికి శ్రీకృష్ణుఁ డుగ్రసేస వసుదేవాదులతో నాతని కెదురువచ్చి యర్ఘ్యపాద్యాదుల నొసంగి సభక్తికముగా నాతనిఁ దన యింటికిఁ దోడ్కొని పోయెను. అచ్చట నవయౌవనయై హావభావ విలాసములతో నతిసుందరాంగియైన యోగమాయ నాతని సేవకు శ్రీకృష్ణుఁడు నియోగించెను. దుర్వాసుఁ డామె పరిచర్యలకు మెచ్చి వరము కోరుకొనుమనెను. శ్రీకృష్ణుఁ డంత నుగ్రసేనాదులఁ బిలిచి దుర్వాసోమహర్షి శివునంశమునను యోగమాయ పార్వతి యంశమునను జనించినవారగుట నుభయులు వివాహమగుట తన యభీప్సితమని వాక్రుచ్చెను. దుర్వాసుఁ డంగీకరించెను... అంత దివ్య వైభవోపేతముగా యోగమాయా దుర్వాసులకు వివాహమై నంత నే శ్రీకృష్ణుఁడు వినయవినమితుఁడై యామహర్షిని గొంతకాలము తననగరముననే యుండఁ బ్రార్థించెను. దుర్వాసుఁ డట్లే యని భార్యతో నటనే నివసించుచుండెను.

ఒకనాఁడు దుర్వాసుఁడు శ్రీకృష్ణుని మాహాత్మ్య మెఱుంగఁగోరి రాత్రివేళ వరుసఁగా అష్టమహిషుల గృహములకుఁ బదునాఱువేల గోపికలయిండ్లకు వెళ్ళి చూచెను. ఆతని కన్ని చోట్లను శ్రీకృష్ణుఁడు భార్యాసహితుఁడై కానవచ్చెను. ఇది చూచి దుర్వాసుఁ డాళ్చర్యమంది యాతని ననేకవిధముల స్తుతించి యానందించెను.[1]

దుర్వాసునికిఁ బార్వతి శ్రీకృష్ణునిగుఱించి తెల్పుట

ఇట్లు ద్వారకానగరమున యథేచ్ఛముగా విహరించుచు దుర్వాసోమహర్షి భూతలమునఁ గాలము వ్యర్థపుచ్చుటకంటెఁ

  1. భారతము - బ్రహ్మవైవర్తపురాణము.