పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

మహర్షి దేవేంద్రనాథటాగూరు

27


యర్థములున్నవో తెలిసికొనంగోరి యానాడు మొదలు సంస్కృతముం జదువుకొని యుపనిషత్తుల నర్థసమేతముగ నేర్చుకొనెను. ఈ వేదాంతభాగములపై నతనికి మరణమువఱకు నింతింతనరాని భక్తి గలదు. దేవేంద్రనాధు నెఱిఁగినవారు కొంద ఱతఁడు జ్ఞానియని వాని యొద్ద వేదాంతము నేర్చుకొనుచువచ్చిరి. వేదాంత విద్యాభివృద్ధికొరకాయన 1839 వ సంవత్సరమున తత్వబోధినియను నొకసభస్థాపించి దేవేంద్రనాథుఁడు తన చెలికాండ్ర బదుగుర నందుజేర్చి వారమున కొకసారి యందఱుంగలసి వేదాంతార్థములజర్చించి జ్ఞానాభివృద్ధి జేసికొనుచు నెలకొకసారి ప్రార్థనలఁ జేయుచువచ్చెను. ఈసభాసంబంధమున నతఁడు 'తత్వబోధినీ' పత్రిక నొకదానిని బయలుదేరఁదీసి దానికిఁ దనమిత్రుఁడగు నక్షయకుమారదత్తును నధిపతిగాఁ జేసెను. ఈసభలో మొదట పలువురు చేరకపోయినను కొలఁది కాలమున నవద్వీప మహారాజగు శ్రీశ్చంద్రరాయలు బర్డ్వాను మహారాజాధినీ రాజు మొదలగువారనేకులు చేరిరి. 1842 వ సంవత్సరమునం దతఁడు తత్వబోధితసభయొక్క ప్రథమసంవత్సరోత్సవమును మహావైభవముతోజరిపెను. ఆ ఉత్సవమున కాయన నగరములోనున్న వాఁరిజిన్న పెద్ద లనక నందఱఁ బిలిచెను. ఊరిలోనున్న తగుమనుష్యు లదివరకు సభ పేరయిన యెన్నఁడు వినియుండనందున నీయుత్సవమున కెవరు రారు గాఁబోలునని సామాజికులు చింతించిరి. కాని రాత్రి యెనిమిది గంటలకు సభామందిర మంతయు జనులతోనిండి క్రిక్కిరిసి కూర్చున్న వారి కూపిరి సలుపనట్లయ్యెను. సభ యెనిమిది గంటలు మొదలు రెండు గంటలవరకు జరిగినను, వచ్చినవారు నిద్రాహారములు మానుకొని జరిగిన చర్యల నెంతయు శ్రద్ధతో నాలకించిరి.

ఇట్లుండి యతఁడు బ్రహ్మసమాజమున కప్పుడప్పుడు పోయి చూచుచుండెను. రామమోహనరాయ లింగ్లాండునకుఁ బోవకమునుపు