పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/192

ఈ పుట ఆమోదించబడ్డది

సర్ జేమ్సేట్జీ జీజీభాయి

ఘూర్జర దేశమున బరోడా యను స్వదేశ సంస్థాన మొకటి కలదు. అందలి నవసారీ యను గ్రామమున జీజీభాయి 1783 వ సంవత్సరము జూలై 15 వ తారీఖున జన్మించెను. వాని తలిదండ్రులు పేదలయ్యు గౌరవాస్పదులయి యుండిరి. ఇతఁడు పారసీజాతివాఁడు. ఈ పారసీలు ఘూర్జరదేశమందును మహారాష్ట్రదేశమం దంతటను వసించుచున్నారు. వీరు విద్యలయందు రూపమునందు ధనమునందు నసమానులు.

జీజీభాయి చిన్నతనమందేమాతాపితృవియోగ మొందుటచే మామగారియొద్ద బొంబాయినగరమున నుండవలసి వచ్చెను. కొంత కాలము ముందు పని నేర్చుకొని పిమ్మటనతఁడు మామగారితోఁ గలసి వర్తకవ్యాపారముఁ జేయ నారంభించెను. మన స్వదేశములోనే గూర్చుండి యెంతవర్తకముఁ జేసినను విశేషలాభములు గలుగ వనియును విదేశములతో వర్తకము చేయుటచేతనే చాలలాభములు గలుగుననియును జీజీభాయి గ్రహించి తన బంధువుఁడగు మఱియొక పారసీ వర్తకునితో గూడి పదునాఱవయేటనే చీనా దేశమునకుఁ బోవ పయన మయ్యెను.

స్వదేశము విడిచి వెళ్ళునప్పు డతఁడు తన యాస్తినంతయు వెంటఁ దీసికొనిపోయెను. ఆ యాస్తి యెంతయందు రేని నూటయిరువది రూపాయలు. చీనాదేశమున కరిగి కొలఁదికాలమే యచ్చట నుండి స్వదేశమునకు వచ్చి స్వయముగఁ దానె వ్యవహరింపఁ దలఁచి పెట్టుబడి నిమిత్తము ముప్పదియైదువేల రూపాయలు ఋణముఁ దీసికొని యతఁడు మరల చీనాకుఁ బోయెను. ఇదిగాక యతఁడు చీనాకు