ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట

' డయారియం ' అనే లాటిను శబ్దమునుండి పుట్టిన ఆంగ్లపదము ' డైరి '. దీనిని తెలుగున మనం ఆంగ్ల సమముగ వ్యవహరించుకుంటున్నాము. ఒక వ్యక్తి ' దినచర్యను ' తెలిపేవి ' డైరీలు '. తొలుత యివి వాతావరణాది పరిస్థితులను తెలిపే భోగట్టాలుగా వుంటూ, రానురాను ప్రస్తుతార్థములో రూఢి అయినవి.

ప్రతిరోజూ తాముచూసే, వినే సంఘటనలను, లోనయే అనుభవాలను, మరుగున పడనీయక, లిఖితరూపమున కొందరు వ్యక్తులు వాటిని వెలయిస్తూవుంటారు. ఐతే వీటిని దిన దినమూ వ్రాసితీరాలనే నియమంమాత్రం లేదు. ఏమీ అంటే, ఎంతటి మహాపురుషుని జీవితంలోనైనా కొన్నిరోజులు, లేదా నెలలు పేర్కొన తగిన ఎట్టి సంఘటనలు సంభవించకపోవచ్చును. కాని ఏవేళ జరిగిన సంఘటనలను ఆ వేళే పేర్కొనడమనేది, డైరీల రచనకు ఒక సామాన్యసూత్రం.

లేఖన సాధనములు వచ్చిన తరవాత, ఏదో వొక రూపంలో, యివి వ్యవహారములో వెలసినవని చెప్పవచ్చును. పదిహేడవ శతాబ్దిలో యూరపులోను, ముఖ్యంగా యింగ్లండు లోనూ యివి ప్రాచుర్యము వహించి, ' రినైజాన్సు ' దినముల