పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/129

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


నిజమయ్యె; కచ్చేరిలో నతఁడు తన ముఖమును వికాసముగ నుంచ జూచెనుగాని అట్టిపని వీలుగాదయ్యెను. పనిపాటులు లేనిసమయములో నతఁడు మౌనముగ నుండును. అతని మనోవ్యధనుభార్య కనిపెట్టి, యతని నడుగుట యుచితముకా దని తలంచి, యొక పన్నాగము పన్నెను. పరివారకు లందఱను బొమ్మని, కత్తితో నామె తన చేతిమీఁద నొక గంటు వెట్టుకొనెను; రక్తము కారుచుండెను. అప్పుడు భర్తవచ్చి కారణమేమని యామె నడిగెను. ఆమె కారణముఁ జెప్పక "ఏమైన మీకేమి? నేను మీకు సహధర్మచారిణియని తోఁచిన, మీ మనోవ్యథను నాతొఁ జెప్పియుందురు. అటుల చేయలేదు గనుక, ....” అని యేడ్వసాగెను. ఆమె చదువుకొనినది; బుద్ధిమంతురాలు; ఆలోచన పరురాలు; 'స్త్రీలనోటిలో నూఁగింజ నాన'దను మాట తెలిసినను, నామెతో నతఁడు కుట్రసంగతిఁ జెప్పెను. ఆమె గాయముఁ జూపించెను.

అనంతరము సీౙరు సభలోనికి వెళ్లుటయు, కుట్రదారు లంద ఱతని నక్కడ బొడిచి చంపుటయు జరిగెను. కొంతవఱకు సీౙరు వారి నెదిరించెనుగాని, బ్రూటసు తనను బొడుచుట చూచి, 'అరే, బ్రూటసు, నీవుకూడానా' యని యతఁడు కండ్లు మూసికొని నేలఁగూలెను. శత్రువును సంహరించి, ప్రజారాజ్యమును నిలఁబెట్టినందుకు, సెనేటుసభవారు బ్రూటసు నభినందించిరి; ప్రజలుగూడ సీౙరు మరణమునకు విచారించ లేదు.