పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/117

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


నీ గండరగండఁడిటుల మహాటోపముతోఁ బరిక్రమించినందుకు సిల్లుఁడు మొగంబు గంటుపెట్టుకొనెను. ఇంతలో నితనికి కాలము సమకూరెను. అవసానకాలమున నితరులను తన కుమారునికి సంరక్షకులుగ నియోగించి పాంపేయునిమాత్ర మితఁడు నిరసనఁజేసెను. సిల్లుఁడు కాలాంతరగతుఁ డయ్యెను. బిరుదు నిశానీలతో నితనిని రుద్రభూమికి దీసికొని వెళ్లునపుడు పాంపేయుఁడు గూడపోయెను.

కొంతకాలమునకు 'లెపిడస్సు' అను నతఁడు రోములో సర్వాధికారమును బొందుటకు సమకట్టి సైన్యములను గూర్చి, వానితోఁగూడ 'ఇటలీ'దేశపు టుత్తరభాగమును జయించి రోముపట్టణసమీపదేశము వచ్చిచేరెను. నాగరికు లందఱు గలతఁ జెందిరి పాంపేయుఁడు పైగానుండి శత్రుసైన్యము నోడించి, వారి భయమును బాపెను. 'లెపిడస్సు'దేశమును విడిచి పారిపోయి దుఃఖము భరింపలేక మృతినొందెను.

స్పానియాదేశము రోముప్రజారాజ్యములోనిది. అక్కడి రాజ్యాధికారి తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యముఁ బొందవలె నని సమరసన్నాహముఁ జేసెను. అతనిని దండించుటకు రోమను అధికారు లొక సేనానిని సైన్యముతోఁ బంపిరి. కాని యతఁడు వానిని శిక్షింప లేకపోయెను. అటుపైని వారు పాంపేయుని సైన్యముతోఁ బంపిరి. అతఁడు స్పానియాదేశముఁ బోయి దాడిలో వైరుల దునుమాడి జయమును బొందెను.