ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

లంకావిజయము


ఉ.

మ్రింగఁడు దేవభూసురవరేణ్యధనంబుల నీతిచేత ను
ప్పొంగఁడు సజ్జనుల్ తనదుభూరిగుణంబులు లెక్కవెట్టుచో
లొంగఁడు వైరు లెంద ఱనిలోన నెదిర్చిన మించె వన్నెవా
సిం గడుఁ బిండిప్రోలికులసింగఁడు మంత్రులలోన నెంతయున్.

39


క.

ఆతనితమ్ముఁడు బుద్ధివి
ధాత నితాంతసువిభూతి ధరణీధరజా
మాత నిరూఢదయాశ్రీ
నేత నియతిఁ గృష్ణమంత్రి నెగడెం ధరణిన్.

40


సీ.

కుయ్యేటి కీశాన్య మయ్యున్నతోరాల
        కోటిచెంత రచించెఁ దోఁట యొకటి
గ్రామస్థపాంథతర్పణమధురోదక
        ప్రప నిజావాసాజిరమునఁ గట్టె
నలఘుపుణ్యక్షేత్రముల దననిక్షేప
        మమరఁజేసెను రమేశార్పణముగ
నుర్వీసురులకు గృహోపకరణధన
        క్షేత్రాదిదానముల్ సేసె మిగుల


గీ.

భూరిదివ్యాలయతటాకములు ఘటించె
గృతిముఖంబున నత్యంతకీర్తి వడసె
మంత్రిమాత్రుఁడె లోకైకమాన్య పిండి
ప్రోలి శ్రీకృష్ణవిభుఁ డుషర్బుధనిభుండు.

41


ఉ.

ప్రేమను బిండిప్రోలికులకృష్ణసుధీమణి పెండ్లియాడె శ్రీ
రామను బోలినట్టిదగురామను సద్వనితాలలామ నా
నామనుముఖ్యతారకసునామనుతిస్ఫుటకామసద్యశ
స్తోమను వక్త్రకాంతిజితసోమను సద్గుణధామ నున్నతిన్.

42