పుట:KutunbaniyantranaPaddathulu.djvu/91

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 91

డయాఫ్రంకి జెల్లీ వ్రాసి లోపల పెట్టుకున్న రెండు గంటలలోగా సంయోగంలో పాల్గొనాలి. అలాకాక ఆలస్యం జరిగితే తిరిగి అప్లికేటరుద్వారా జెల్లీని లోపలికి ఎక్కించుకోవాలి. డయాఫ్రం పెట్టుకుని నడవవచ్చు, స్నానం చేయవచ్చు. మూత్ర విసర్జన చేయవచ్చు. కాని సంయోగానికి ముందు ఒకసారి డయాఫ్రం సరయిన స్థితిలో ఉందో లేదో చూచుకోవాలి.

ఒకసారిసంయోగంఅయిన తరువార తిరిగి కొద్దిసేపట్లో సంయోగంలో పాల్గొన్నట్లయితే తిరిగి జెల్లీని అప్లికేటరు ద్వారా డయాఫ్రం దగ్గరికి నొక్కాలి. సంయోగం అయిన ఆరుగంటల వరకు డయాఫ్రంని యోని మార్గం నుండి తొలగించకూడదు. ఒకవేళ డూష్ చేసుకోవాలని మనసుంటే సంయోగం అయిన ఆరుగంటలవరకు డూష్ చేసుకోకూడదు.

సంయోగం అయిన ఆరు గంటల తరువాత తొలగించి తీసివేసిన డయాఫ్రంని సబ్బునీళ్ళతో కడిగివేసి ఆరబెట్టి, పౌడరు జల్లి జాగ్రత్తగా అట్టిపెట్టాలి. సాధారణంగా డయాఫ్రం చిరగడంగాని, కన్నాలు పడడం కాని జరగదు. కాని డయాఫ్రం అంచుల దగ్గర స్ప్రింగు వుంటుంది కనుక అక్కడ కాస్త చిరగడానికి అవకాశము ఉంది. డయాఫ్రంకి యెటువంటికన్నాలు లేవని తెలుకోవాలంటే అది కప్పు ఆకారంలో ఉంటుంది కనుక అందులో నీళ్ళూ పోసి పరీక్ష చేయాలి.