పుట:KutunbaniyantranaPaddathulu.djvu/185

ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 185

చిన్న వయసులోనే గర్భం వస్తే నష్టాలు

రజస్వల అయిన కొద్ది నెలలకో సంవత్సరాలకో వెంటనే గర్భం వస్తే కాన్పు అవడానికి ఎంతో యిబ్బంది కలగవచ్చు. ఒక్కొక్కసారి ఆ చిన్నారి తల్లులకి సిజేరియన్ చేసి బిడ్దను బయటకు తీయవలసి వుంటుంది. ఎందుకంటే ఆ వయస్సుకి బిడ్డపుట్టే మార్గంలో తగినంత విశాలంగా పెరగడం జరగదు. దీనికి కారణం బస్థి మార్గంలోని ఎముకలు బిడ్డ బయటకు రావడానికి వీలుగా వెడల్పు కాకపోవడమే. అటువంటప్పుడు సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్దను బయటకు తీయకపోతే తల్లి ప్రాణానికి బిడ్డ ప్రాణానికి కూడా ప్రమాదం జరగవచ్చు. అందుకనే బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే పూర్వపు రోజుల్లో ప్రసూతీ సమయంలో మాతృ మరణములు, శిశు మరణములు ఎక్కువగా ఉండేవి. ఇది ఇలా ఉండగా తల్లీ, బిడ్డా తరచుగా అనారోగ్యానికి గురి కావడం జరుగుతూ వుండేది. ఇటువంటి యిబ్బందులు వుండగా రజస్వల అవడంతోనే కాపురానికి పంపినట్లయితే మానసికంగా తగిన పరిపక్వత లేక దాంపత్య సుఖం అనుభవించడం జరగదు. రతిలో తృప్తి తెలిసే వయసు వచ్చేసరికి పిల్లలు పుట్టడంతో బాధ్యతలు పెరగడంతోను, ఒంట్లో శక్తిలేక నీరసంగా అయిపోవడంతోను రతి ఎడల ఆసక్తి లేకుండా పోతుంది 18-20 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత వివాహం చేసుకుంటే, అటు కాన్పులలో ఇబ్బంది కలగదు. యిటు దాంపత్య జీవితంలో నీరసమూ వుండదు.

* * *