స్థలము ఏడు] కుంభరాణా 53
రాణా : ఆ హారమును దీసికొండు.
సుశీల : [సిగ్గుపడుచు హారముదీసి వినయ మభినయించుచు దూరము నుండి బలవంతరావుచేతి కందియిచ్చును]
బల : [రాణాచేఁత బెట్టును]
రాణా : [పరీక్షించుచుండును.]
సుశీ : [స్వగతము] ఎవరైనా నన్ను మోసంచేసి వుండరుగదా ?
రాణా : దాసీ, నీ కీహార మెక్కడిది ? మాబొక్కసములోని ధనమంతయు వెచ్చించినను దీని మూల్యమునకు సరిపోదు.
సుశీ : [స్వగతము] అబ్బో! అట్టాంటి హారమా యిది ? యెంత వెఱ్ఱి ముండను. దాచైనా పెట్టుకోక పోతిని.
రాణా : ఏమి యాలోచించుచున్నావు ? కట్టుకథ లల్లకుము. యధార్థము చెప్పుము.
సుశీ : నిన్నటిదినం రాణిగారికి మందియ్యడానికి వచ్చిన వైద్దుగులు ఈహారము ఇచ్చిపోయినట్లుంది.
రాణా : ఊహించుటయేమి ? నీవు చూడలేదా ?
సుశీ : [భయముతో] రాత్రంతా అమ్మగారికి విసుర్తూనే వుండి నిద్రలేక అప్పుడే కన్నట్ట మాల్చాను.
రాణా : ఓహో ! కన్నుమాల్చితివా ?
సుశీ : తర్వాత రాణిగారు నన్ను దగ్గరికి పిలిచి "ఒసె సుశీలా, ఇక్కడ వుండే దాసీల్లోకెల్లా నీవుకొంచెం ముక్కూ మొగం అందంగా వుండేదానివి, ఈహారం నీకైతే తగివుంటుంది" అని నేను వద్దనేకొంది నా మెళ్ళోవేశారు.
రాణా : [కోపముతో] ఓసీ, బుద్ధిలేనిదానా, నీసౌందర్యవర్ణనముతో మాకిప్పుడు పనియేమి ? మీరాకు ఆవైద్యులు ఈవజ్రహారము నిచ్చిరా? లేక అంతకుముందే ధరించియుండినదా ?