ఈ పుట ఆమోదించబడ్డది

విప్లవంబుల దేశమ్ము వీగుచున్న,
గృషి ద్యజింపకు కర్షకా, కీడు గలుగు. 104

నవ్యపాశ్చాత్య సభ్యత నాగరకత
పల్లెలందు నస్పష్టరూపముల దాల్చి
కాలసమ్మానితములైన గ్రామపద్ధ
తులను విముఖత్వముం గొంత గలుగజేసె. 105

పంచాయతీసభా భవనంబులౌ రచ్చ
          కొట్టంబు లొకమూల గూలిపోయె,
వీథిబడుల జెప్పు విజ్ఞానధుర్యులు
          నొజ్జలు దాస్యంబు నూతగొనిరి,
గ్రామపరిశ్రమగలుగు నన్యోన్యమౌ
          సహకారవృత్తంబు సమసిపోయె,
సత్యజీవనము, విశ్వాసమ్ము, భక్తియు
          నైకమత్యము మున్నె యంతరించె
 
బూటకములు, కుయుక్తులు, మోసగతులు
కోర్టువ్యాజ్యాలు, ఫోర్జరీల్‌, కూటమైత్రి,
స్వార్థపరత, మౌఢ్యంబు, గర్వప్రవృత్తి
నేర్పు విద్యాలయంబులు నేటియూళ్లు. 106