పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

మాధవప్రభృతు లాత్మాభిధానంబులు
         మించ లింగముల స్థాపించుచోటు
కలుషకర్ముల సుకర్ములఁజేయు సురగంగ
         యంచితస్థితిఁ బ్రవహించుచోటు

అరయఁ బంచత్వమొందినయట్టి జంతు
వెట్టిదైనను లింగమై పుట్టుచోటు
కాశి యది పుణ్యరాశి దుష్కలుషవల్లి
కా శితాసి భజింతు నిక్కముగ నెంతు.

7. ఇద్దఱు భార్యలుకలవాఁడు

ఒకతఱినొక్కదానిఁబ్రియ మొప్పఁగఁజూచినఁగోపమందు వే
రొకతె, సుబుద్ధిదానిపయినుంచిన నద్ది కుబుద్ధివంచనున్
గకవికదోఁప నిద్దఱగుకాంతలు కల్గినవానికష్ట మే
రికి వివరింపనౌ నది భరించిన శూలికిఁగాక యెయ్యెడన్

8. సమస్య : జయజయయంచుఁ గౌరవులు చాలవిషాదముఁజెంద నాత్మలోన్‌

భయదపరాక్రమంబునను బార్థులఁగూల్చునుభీష్ముఁడంచు దు
ర్నయమునఁబల్కు కౌరవుల నాకువశంబొకొనిల్పనంచు మే
ల్జయమగు మీకటంచనియెసంజయుడద్ది గ్రహించియౌర సం
జయజయయంచుఁ గౌరవులు చాలవిషాదముఁజెంద నాత్మలోన్

భయదపుసింహనాదము ప్రభంజనసంభవుఁ డాచరించి టె
క్కియముపయిన్నటింప హరి కేల్గవ దట్టినుతింపఁ బార్ధుఁడ
క్షయధృతినారిమీటఁగనె, ఘల్ఘలమ్రోఁగెను వింటిగంటమేల్
జయజయయంచుఁ గౌరవులు చాలవిషాదముఁజెంద నాత్మలోన్