పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

నివాళి

అరకప్పు కాఫీ తాగి ఆకలి తీర్చుకునే అర్భకుల అర తెలుగుతనానికి అందని అవధాన సాహితీ గగనంలో మెరిసే ఇరుతారలు శ్రీ కొప్పరపు కవులు.

తిరుపతి వేంకట కవులు, కోటసోదర కవులు; వీరిబాటలో వేటూరి వేలూరి కవులు కొడాలి విశ్వనాధ కవులు, వేంకట పార్వతీశ్వర కవులు అవధాన సాహితీ సరస్వతిని అర్చించిన వారే.

అఖండ సృజనాత్మకత, అపార శేముషీ వైభవం, అద్వితీయ సమయస్ఫూర్తి, అనంత ధారణా సిద్ధి కలిగి ఆ వీరకవులు ఆంధ్ర సాహితీ క్షేత్రంలో చేసిన స్వైరవిహారం ఒక సువర్ణాధ్యాయం.

శ్రీ తిరుపతి వేంకట కవులతో పాటు ప్రధమ స్థానీయులై కవితా శిల్పం సల్పిన శ్రీ కొప్పరపు కవులను స్మరించుకోగలగడం నా భాగ్యం.

వేటూరి సుందరరామమూర్తి.

17-10-2003