పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/122

ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చెను. కనుక నాభార్య అత్తవారింటి కొత్తకాపురమునకు అదియే మొదలని చెప్పవచ్చును. కొలది రోజులలో తమ్ముని వివాహమునకు లగ్నము నిశ్చయమయ్యను. అప్పుడు మండువేసవి. నాభార్యను పిల్లలను గుంటూరునకు తీసుకొనివచ్చినారని విని వారిని చూచుటకు వచ్చి, రెండుపూట లుండి మరల బందరు వెళ్ళితిని. పెద్దపిల్లది పచ్చని దేహచ్ఛాయ, కనుముక్కు తీరు మంచిది. నా కెంతో ఆనందముగ నుండెను. రెండవపిల్ల అంతకంటెను అందముగ నుండుటచే మిక్కిలి సంతసించితిని. కాని నేను బందరుచేరిన కొలదిరోజులకే రెండవపిల్ల మృతినొందినట్లు ఉత్తరము వచ్చినందున నాలో నేను చింతించితిని. మరల ఒక్కసారి భార్యనుచూచి ఓదార్చుటకు పోతిని. భరింపరాని కడుపుదు:ఖ మంతయు తనలో తాను మ్రింగుచున్నదేగాని అంతగా వెలిబుచ్చనందుకు కొంత సంతుష్టిచెందితిని. ఒక్కరోజు ఉండి, ఓదార్చి మరల బందరుచేరితిని. గుంటూరునకు ఎండలలో తీసుకొనివచ్చినందున పిల్ల చనిపొయెనని నాభార్య మనస్సున పరితపించుచుండెను. నేను విధివశము తప్పదుగదా యని ఊరడిల్లితిని. వేసవిసెలవులకు కోర్టులు మూసివేసినతర్వాత నేను గుంటూరు చేరినాను. అప్పుడు మా మేనత్తగారు పెద్దది యొక్కతెయే ఆడదిక్కు. ఆమెయే నాభార్యను ఓదార్చుచు ఆమెను పిల్లనుగూడ ప్రేమతో చూచుచుండెను. ఇంతలో కొలదిదినములలో వివాహమునకు బయలుదేరి వెళ్ళితిమి. కనుమూరు అడవిపట్టున నున్న చిన్నపల్లె. అందు గాడిచర్లవారు రెండుకుటుంబములవా రుండిరి. అందు పెద్దవారికి కనుమూరిలో రెండువంతులును, మాతమ్మునకు పిల్లనిచ్చిన కృష్ణమూర్తిగారికి