పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/109

ఈ పుట ఆమోదించబడ్డది

తండియారుపేట మొదలగునవి మాకు అపరిచితములుగనే యుండెను. తిరువళ్ళిక్కేణిలో రెంటాల వెంకటసుబ్బారావుగారు హైకోర్టు వకీలుగానుండి వాసముచేయుచుండిరి. తాము ప్రకటించిన గ్రంథముల మూలకముగ ద్రవ్యసముపార్జన దండిగ జేయుచు పేరు ప్రతిష్ఠలు జెందుచుండెను. హైకోర్టు వకీలువృత్తి ఆయనకు నామమాత్రమే. వారిని చూచుటకు నే నప్పుడప్పుడు పోవుచుంటిని. ఒకటిరెండుసార్లు ఇంటియొద్దనుండి డబ్బు వచ్చుటకు ఆలస్యమైనప్పుడు వారి నడిగితెచ్చుకొని మరల వారికి చెల్లించితిని. ఆయనయందు గురుభావ ముండెను. వారును నాపై ప్రేమగలిగియుండిరి. వీరిస్థితి మిక్కిలి ఉచ్చదశలో నున్నపుడు వీరి చెల్లిలికుమార్తెకు సంబంధమునిమిత్తము మేము బసచేసియున్న తంబుచెట్టివీధిలో మాయింటికి వచ్చి, మమ్ము నందరిని కలుసుకొని, అప్పుడు మాతోడనే ఆయింట వాసము చేయుచున్న కాశీనాథుని నాగేశ్వరరావుగారికి ఆపిల్లను ఇచ్చుటకు నిశ్చయించుకొనిరి. అప్పుడు నాగేశ్వరరావు ఎఫ్. ఎ. సీనియర్‌లో చదువుచుండెనని జ్ఞాపకము. అచ్చట నున్న తెలుగు విద్యార్థులము పెండ్లి పెద్దల మైతిమి. వివాహమునకు తిరువళ్ళిక్కేణికి నాగేశ్వర్రావును పిలుచుకొనిపోయిరి. మమ్ము నందరిని వివాహమునకు ఆహ్వానము చేసినందున మేము కళ్యాణమహోత్సవము జూచి, మాలో నొక్కడుగా నుండిన నాగేశ్వర్రావుకు అప్పటినుంచి రెంటాలవారి యింటనే నివసించుచుండెను. ముందు కాలములో నాగేశ్వర్రావు ఇంత గొప్పవాడు కాగలడను మాట మా కపుడు తోచలేదు.