ఈ పుట ఆమోదించబడ్డది

అతడు కళలను గురించి అంతబాగా తెలుసుకోలేదు. అతని గొంతుక బాగానే ఉంటుంది. విన్న పాటగానీ, పాటపాడే విధానంగాని మరచి పోకుండా చక్కగా పాడతాడు. సంగీత శాస్త్రాన్ని గురించి ఏమీ తెలియదు.

బొమ్మలు చూస్తాడు భారతిలో, మోడరన్ రివ్యూలో, ఇంకా ఇతర చోట్లా ప్రచురణమయ్యే బొమ్మల్ని పరిశీలించి చూస్తాడు. అవి అజంతావైనా ఒకటే. అమరావతి వైనా ఒకటే, చటర్జీవైనా ఒకటే.

తనకు ఏ విషయం గురించి తెలియక పోయినా తెలియదని చెప్పేస్తాడు. మాట్లాడే వాడి ఉద్దేశం గ్రహించి, ఏ విషయాన్ని గురించి వాదన వచ్చినా బాగా చదువుకున్నవాడిలా కోనంగి వాదిస్తాడు.

కోనంగి. ఆటలో ఆందెవేసిన చెయ్యే. కాని తాను చదివే విద్యాశాలలో పిల్ల వాళ్ళు మెచ్చుకుంటూ, తమ వీరుణ్ణి చేసుకునేటంతవాడు మాత్రం కాదు.

పరీక్షలలో మొదటివాడుగా నెగ్గేవాడు. పరీక్ష విషయాలను గూర్చి ఎవరు ప్రశ్నవేసినా చక్కగా ప్రత్యుత్తరం చెప్పేవాడు.

చదువు లయ్యాయి. జీవితంలో ప్రవేశించాడు. ఇంటిలోనుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూచిన బాలకునిలా అతడు గుమ్మందగ్గిర నిలుచుండి తన్ను తాను ప్రశ్నించుకున్నాడు.

చదువుకున్నన్నాళ్ళు అల్లరిపిల్లవాడే. ఎవరికీ కష్టం కలిగించని అల్లరి, అనేకరకాల వేషాలు వేసేవాడు. స్నేహితులు కూడా గుర్తుపట్టని వేషం వేసివాళ్ళ గదులలోనికి పోయి అల్లరిచేసేవాడు.

ఒకనాడు చాకలివాని వేషం వేసికొని, ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. (అతని చాకలివాని సంగతులన్నీ ఇదివరకే తెలిసికొని ఉన్నాడు) “మరిడయ్య మా చుట్టమేనండి, ఆడే పంపాడండి” అని తన స్నేహితుని తల్లితండ్రులనూ, తక్కినచుట్టాలనూ నమ్మించి బట్టలన్నీ వేయించుకుని తన ఇంటికి తీసుకుపోయాడు.

అక్కడ అవన్నీ మడతలు పెట్టి పెద్ద పార్శిలుకట్టి “దీపావళి బహుమతి” అని పేరుబెట్టి తన స్నేహితునకు తన పేరుతో బహుమతి పంపాడు. కొన్నాళ్ళవరకూ బందరంతా నవ్వింది.

కోనంగికీ ఆ రోజుల్లో చాకలి కోనంగి అని పేరువచ్చింది.

ఒకనాడతడు బి.య్యే అయిన రోజులలో, పదిమంది స్నేహితులను వెంటబెట్టుకుని, తాను సర్వేయరులా, కావలసిన సామాను పట్టుకొని బచ్చుపేట - రామానాయుడుపేట కలిసేచోటికిపోయి, ఆ వీధి కొలుస్తూ ఆ దారినివేళ్ళే ఒక పెద్దమనుష్యుని పిలిచి "ఈ చివర పట్టుకోండి సార్' అని కోరినాడు. ఆ వీధి మలుపుతిరిగి, ఇవతలి వీధిలోవెళ్ళే ఇంకో పెద్దమనిషితో “ఈ చివర కొంచెం పట్టుకోండి సార్" అని అందిచ్చి. స్నేహితులతో వెళ్ళిపోయినాడు.

ఆ పెద్దమనుష్యులిద్దరూ, ఒకరికి తెలియకుండా ఒకరు ఆ తాడు చివరలు ఒకరోవీధిలో ఇంకోరోవీధిలో పట్టుకుని ప్రభుత్వాని కెంతో సహాయం చేస్తున్నా మనుకొని ఒక గంటన్నరసేపు అలా ఉన్నారట. చివరకు ఒకాయన చాలా ముఖ్యమైన పని ఉండి ఏమవుతోందో చూదామని వీధిమలుపు తిరిగి చూస్తే తాడును ఒకచివర తాను, ఇంకో చివర ఇంకో పెద్దమనుష్యుడు పట్టుకుని ఉండడం చూచి, ఇంకెవ్వరూ అక్కడ లేకపోవడం చూచి, “ఏమిటండీ ఈ కొలత?” అని అడిగాడు.