ఈ పుట ఆమోదించబడ్డది

తనంత అసలైన తెలివితక్కువ ఆంధ్రుడు ప్రపంచంలో ఇంకోళ్ళు ఉండరు! తన కెందుకు అనంతలక్ష్మిని పెళ్ళిచేసుకోడానికి ఇంత భయం? తాను వట్టిబీదవాడు. ఉద్యోగం లేదు. ఉద్యోగం ఇచ్చేవారులేరు. ఇచ్చేవారు ఒకరిద్దరున్నా, వాళ్ళు ఏ వంటవాడి పనో, గుమాస్తా పనో ఇస్తారు. లేకపోతే ఇప్పిస్తారు. అంతకన్న తనకు ఇంక గతి ఏమిటి?

ఈలాంటి తాను, భాగ్యనిధి, సౌందర్య సముద్రమూ అయిన ఒక బాలికను పెళ్ళిచేసుకోవడమే! తనది దొంగ ఎత్తన్నమాటే కాదూ! తనలో కూడా బూర్జువాతనం సంపూర్ణంగా ప్రవేశించింది. గాంధీగారు అహింసా, సత్యాగ్రహ తత్వాలు వ్యతిరేకించాయి అన్నమాటేగా?

తాను నెమ్మదిగా ఈ బాలిక జీవితంలోంచి తప్పుకుందామనుకుంటే, తనలో వుద్భవించిన ఆ నీరసత్వం, తన్ను వట్టి పిరికివాణ్ణిగా చేసి పారవేస్తుంది. తనలో ఒక వీసమెత్తయినా గౌరవమూ గర్వమూ వుంటే, తాను అనంతలక్ష్మిని వీడి వెళ్ళిపోవాలి. చిన్నతనంలో, ఎన్ని బొప్పెలు కట్టినా, త్వరలో మరిచిపోతాం. ఎంతమంది యువకులు తాము గాఢంగా ప్రేమించాము అనుకున్న భార్యలు తమ్మువిడిచి, దేహంచాలిస్తే, వెంటనే నెలలన్నా కాకుండా, రెండవ భార్యలను చేసుకోలేదు?

ఎంతమంది యువతులు తమ దైవము అనుకున్న భర్తలు పోతే, నిముషంలో ఊరటపొంది, మామూలుగా తిరగటంలేదు. వారి విచారం అంతా వైధవ్య చిహ్నాలు ధరించి విధవా జీవితం భరించవలసినదనే.

అలాగే తాను అనంతలక్ష్మిని వదిలి వెళ్ళిపోతే ఆ బాలిక కావ్యంలోలా తన్ను ప్రేమించి వుండకపోతే ఒక నెలరోజులలో మరిచిపోతుంది. లేదా తన్ను తలంచుకొని దుఃఖించడం మానివేస్తుంది. తాను అనంతలక్ష్మిని కావ్యంలోలా ప్రేమిస్తుంటే, ఆమె తన హృదయంలో, ఆత్మ అనే పదార్థంలో వుంచి షోడషోపచారవిధిగా అర్చిస్తూ వుంటాడు. తాను బాధపడినా, ఆ బాధంతా మగవానిలా భరించాలి. అంతేకాని ప్రబంధ నాయకులులా ఏడుస్తూ కూర్చోకూడదు.

అతడు లేచాడు. మొగం కడుక్కొని, స్నానాదికాలు కావించి, కాఫీకని హాలులోనికి వచ్చి కూర్చున్నాడు. అనంతలక్ష్మికి కోపం రావడం చాలా మంచి దనుకున్నాడు. ఆ బాలికకు ఈ ఏడాది బాగా చదువుచెప్పి, ఆ తర్వాత ఆమె కంటికి కనబడకుండా వెళ్ళిపోవచ్చు. ముష్టి ఎత్తుకొని తిరిగేవాడికి లోకం అంతా వాడిదే!

కాఫీ వగైరాదులు పుచ్చుకొన్నాడు. లోపలికి వచ్చాడు. హెూటలు గుజరాతుకు బస్సు ఎక్కి చేరుకున్నాడు. ఆ రోజు జీతం నష్టం అని హెూటలు యజమానితో చెప్పితే, యజమాని మండిపోయి “నువ్వు నాకు వద్దయ్యా” అని చెప్పినాడు.

“అవునండీ, ఎవరిక్కావాలి ఈ దరిద్రఘటం. ఘటవాద్యానికి పనికిరాదు. నీళ్ళు పోసుకోడానికీ పనికిరాదు. అమ్మవారి ఘటపూజకూ పనికిరాదు”అని లోనికిపోయి కోనంగి బట్టల పెట్టి సర్దుకుంటూవుంటే, తోటి అరవబాలకుడు పరుగునవచ్చి “నిన్న రాత్రి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, ఎవరో రెడ్డిగారుట. ఒక నాటుకోటిచెట్టి వచ్చి మన మేనేజరుతో చాలాసేపు గుసగుసలాడారు. మన నాయరు “శంకరన్' రెండు మూడు ముక్కలు విన్నాట్ట. నీ మాటే నూరుసార్లు వచ్చిందట. నిన్ను పంపించివేయమని పట్టు పట్టాడట” అని కోనంగికి చెప్పాడు.