ఈ పుట ఆమోదించబడ్డది

ఆ కోపంలో ఆమె ఎంత అందంగా ఉంది. అందాలు ఎన్నిరకాలు. అందమైన స్త్రీ సృష్టికంతకూ కిరీటమే. ఒక్కొక్క దేశంలో అందమైన స్త్రీల అందం ఒక్కొక్కరకం అందంగా ఉంటుంది.

స్త్రీ సౌందర్యం మనుష్యుల పురోగమనానికి నిజమైన ఉత్తేజం కలుగజేస్తుంది. మనుష్యునిచేత స్త్రీ సౌందర్యము ఎంతటి ఉత్తమ కార్యమయినా చేయిస్తుంది. స్త్రీ సౌందర్యం మనుష్యుని హీనమైన పశువునిగా తయారుచేస్తుంది.

5

ఆ రాత్రి కోనంగి పాఠాలు చక్కగా చెప్పాడు. పాతపాఠాలు ప్రశ్నలువేసి పరీక్ష చేశాడు.

అనంతలక్ష్మి ముభావంగా అసలైన విద్యార్థినిలా పాఠాలు నేర్చుకుంది. కాని మామూలు హుషారు, ఆ కంఠంలో ఏది? కోనంగి పాఠాలు పదకొండు గంటలకు ముగించాడు. ఇక లేచి వెళ్ళబోతూ, “లక్ష్మీ! అంత కోపం వచ్చిందేమిటి నామీద! ఇంకా తగ్గలేదా?” అని అడిగాడు.

అనంతలక్ష్మి కంట నీరు తిరిగింది. తల వంచుకొని, కోనంగి చూడడం లేదనుకొని పైటకొంగుతో కళ్ళు తుడుచుకొంది. కాని కోనంగి చూచాడు. చూడనట్లు నటించాడు.

"లక్ష్మి....!"

"ఊఁ! ఊఁ!” అన్నట్లు తల తిప్పింది అనంతలక్ష్మి. కోనంగి “ఎందుకు నీకు కోపం రావాలో అర్థం కావటంలేదు”అన్నాడు. “శబ్దరత్నాకరం మొదలయిన నిఘంటువులలో 'కోపం' అనే మాటకు అర్థం రాస్తాడు గాని, అనంతలక్ష్మికి కోపం ఎందుకు వచ్చిందో రాయడుగా! అందుకు అర్థం ఏమిటని అడిగాను” అన్నాడు.

అవును ఎందుకు రావాలి కోపం తనకు? తనకూ అర్థం తెలవదు. ఎవరు చెప్పగలరు? అనుకుంది అనంతలక్ష్మి.

“అనంతలక్ష్మి! నేను మీ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాను అని నీకు కోపం వచ్చిందా, లేకపోతే నిన్ను 'అమ్మా' అని పిలవడంవల్లనా?” అని ప్రశ్నించాడు కోనంగి.

అనంతలక్ష్మి దగ్గిరకుపోయి కోనంగి ఆమె భుజంమీద చేయివేసి “అనంతం! ఇల్లా తిరుగు” అని కోరాడు. అనంతలక్ష్మి చటుక్కున కోనంగివైపు తిరిగి, కరిగిపోయి, అతని పాదాలపై వాలి, “మీరు మా ఇంట్లో ఉండిపోండి” అని అన్నది.

కోనంగి గుండె గుబగుబలాడుతూ ఉండగా ఆమెను లేవనెత్తాడు. వెంటనే అనంతలక్ష్మి అతని చుట్టూ చేతులు పోనిచ్చి, గాఢంగా అతన్ని తన హృదయానికి అదుముకొని తన మోము అతని హృదయంలో దాచుకొన్నది. కోనంగి పులకరించాడు. ఉప్పొంగిపోయాడు. ఆమెను తనకు ఇంకను దగ్గరగా లాక్కొని, కుడిచేతితో ఆమె మోమునెత్తి ఆమె కళ్ళల్లోంచి చూస్తూ “లక్ష్మి! ఈ బిచ్చగా.....”

“అలా అనకండి. నాకు మీకంటే, ఇతరులు కోటీశ్వరులు అయినా అక్కరలేదు” అన్నది.

ఇంతట్లో జయలక్ష్మి “అమ్మిణీ! ఇంకా పాఠాలు కాలేదా” అంటూ వస్తున్న చప్పుడు అయింది. అనంతలక్ష్మి కోనంగి విడిపోయారు. కోనంగి ఆ పక్కనే ఉన్న కుర్చీపైన కూర్చున్నాడు. అనంతలక్ష్మి నిలుచుండి ఉన్నది. జయలక్ష్మి వారిద్దరి దగ్గరకు వచ్చేలోపున,