ఈ పుట ఆమోదించబడ్డది

అతడు దూరంగా నెట్టివేస్తాడు. అలాంటి పిచ్చి నమ్మకాలు అంటే అతని కేమాత్రం నమ్మకంలేదు. ధనానికి ఆశపడితే తనలా ధనవంతులైనవారి కందరికి ఈ సుందర నారీబృందము వశులవుతూ ఉంటారని ఆయన ఏలా అనుకోగలడు! ఒక్కొక్క ప్రసిద్ధ భూలోకాప్సరస మనోహరాంగనను గద్దలా ఎగతన్నుకు పోవడానికి లక్షరూపాయలనే గోళ్లు ఉద్భవింప చేసుకోవలసి వచ్చింది చెట్టియారు జీవిత విటవిహంగానికి.

అలా తాను చేస్తున్నా, తన ధనమనే అయస్కాంతం విలాసవతుల ఇనుప హృదయాల ఠంగున లాగుతున్న విషయం అతనికి తెలిసి ఉన్నా, చెట్టియారుగారు తన్ను తానే నమ్మదలచుకోలేదు.

ఈలాంటి ఆద్భుతమైన కారణాలవల్ల చెట్టియారుగారికి తన విజయం అనే ఓడ గిరగిర సుడిగాలిలో తిరుగుతోందని తోచింది. కాని, ముందుకు ఒక అడుగు నడవటంలేదు. అయినా నాటుకోటు చెట్టియారులకు నూటికి వేయి రూపాయలు వడ్డీకట్టి, ధనం కుప్పతిప్పలు ఇంట్లో పోసుకొనే నేర్పుకు శిఖరశిల ఆయినట్టి, తనశక్తి అనంతలక్ష్మిని మూడురోజులు తప్పితే, మూడు నెలలలో, తప్పితే మూడు ఏళ్ళలోనన్నా తనకు తానే చెట్టిగారి పురుషత్వానికి సిద్దిఅయి తీరుతుంది అని దృఢంగా నమ్మినాడు.

"ఇంతట్లో మళ్ళీ ఒక్కసారి చూద్దామని, చెట్టియారుగారు అనంతలక్ష్మి చదువుల గదిలోనికి వచ్చేసరికి, ఒక చక్కని యువకుడు తెలుగుపాఠం చెబుతున్నాడు.

“రసములు తొమ్మిది, కాని అన్నింటిలో రాణి శృంగారం. శృంగారానికి స్థాయీభావము రతిగాని విప్రలంబముగాని కావచ్చును. ఇప్పటి నవలలలో కథలలో పాటలలో కూడా శృంగారమునకే ప్రాధాన్యం ఈయబడుతున్నది.”

“శృంగారము అంటే అలంకరించుకొనుట అనే అర్థం ఉందిగదా అండి.”

“అవును. దానినిబట్టి మీరు ఊహించుకొనవచ్చునుగదా! రసము అనేది సాహిత్యపరమైనది మాత్రము అని.”

“చాలా గొడవగా ఉంది. గ్రంథంలో 'ఇది శృంగార రసభరితమగు కావ్యము' అని ఆ గ్రంథకర్త రాసినారు. నాకు రసమంటే ఏమిటో మాతెలుగు ఆచార్యాణిగారు తరగతిలో చెప్పారుగాని నా మనస్సుకు ఎక్కలేదు.”

“మనుష్యుడు ఎలాంటివాడో అలాంటిది కావ్యం అనుకుందాం.”

“మంచిదండి.”

“ఆ మనుష్యునకు ఆత్మ ఎలాంటిదో, కావ్యానికి రసం అటువంటిది అనుకుందాం.”

“సరేనండి.”

"శృంగారాది రసాలు, పురుషుని వ్యక్తిత్వమువంటివి.”

ఈలా పాఠం సాగుతోంది. వారిద్దరు కూచోడంలో, వారిద్దరిమధ్యనా బల్లమీద నృత్యంచేసే పాత్రత్వంలో, చిరునవ్వులలో, ఆ చూపులలో ఏడో తనంలో, చెట్టియారుగారికి కాళ్ళలో ఎముకలు మాయమయ్యేటంత భయంకర స్థితి సంభవింపచేసే ఏదో విపరీత సంఘటన అస్పష్టంగా తోచింది.

“యార్ ఇవన్! (ఎవరు వీడు) యార్ ఇంద సైతాను!” (ఎవడీ సైతాన్) అని అనుకున్నాడు. అతని గుండెలో నల్లబండరాయి గుబేలుమని పడింది. మోమున చెమటలు గుమ్మాయి.