ఈ పుట ఆమోదించబడ్డది

3

చిరునవ్వుతో కోనంగి అందరి స్నేహితుల దగ్గిరా సెలవు పుచ్చుకొంటూ సారా దగ్గరకు వచ్చి “నిన్న రాత్రి నేను నీ హృదయానికి కలుగజేసిన బాధకు క్షమించు సారా! నేను వట్టి పిరికివాణ్ణి! చెప్పానుగా అదృష్టాన్ని కూడా కాలదన్ను కొనే కళ్ళు మూతగాణ్ణి. నీ ఉత్తమ హృదయం.... అని చెప్పబోతుంటే సారా అడ్డంవచ్చి “కోనంగీ, నువ్వు రేపు శనివారం సాయంకాలం నాలుగు గంటలకు మా యింటికి రా. నీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఇక వెళ్ళు...” అని సెలవు తీసుకొని తన పనిలో తాను మునిగింది.

కోనంగి నవ్వుతో వెళ్ళిపోయాడు. గదికి వెళ్ళడమెందుకని ఆ మిట్టమధ్యాహ్నం ఏమి బుద్ధి పుట్టిందో తిన్నగా గుజరాత్ హెూటలుకుపోయి, దానికి మేనేజరయిన కిషన్ చంద్ బాలక్రాంగారిని కలుసుకొన్నాడు. హెూటల్ గుజరాత్ బ్రాడ్వేలో ఉంది. అతిథులకు సమస్త సదుపాయాలూ చేయడంలో ఆ హెూటలు మదరాసులోకెల్లా మంచిదని పేరు పొందింది.

హెూటల్ గుజరాత్ మేనేజరు కొంచెం గాంధీతత్వవాది. కాంగ్రెసు అంటే విపరీతమైన మంచి అభిప్రాయం. మహాత్ముడు శ్రీకృష్ణావతారమని అతని నమ్మకం.

కోనంగి ఆయన్ను కలుసుకొని “అయ్యా నేను బి.ఏ. మొదటి తరగతిలో నెగ్గాను. ఇప్పుడే యుద్ద సంబంధమైన పరిశ్రమలెన్నో ప్రారంభమయ్యాయి. కాని ఎందుచేతనో నా మనస్సు ఉద్యోగాలమీదకు పోవటం లేదు. అవి తప్పనీ, ఒప్పనీ వాదించేటంత సాహసమూలేదు. నాకు ఇష్టమూ లేదు. నాకు మాత్రం ఆ ఉద్యోగాలమీదకు ససేమిరా బుద్దిపోవటంలేదు. ప్రస్తుతం జర్మనీవాడు వస్తేమాత్రం వాణ్ణి ఆ ముందు క్రాఫింగు పిలకపట్టి జాడించి వదులుతాను. అవన్నీ అల్లా ఉంచి నాకు మాత్రం మీహెూటల్లో ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించాలి” అని మనవి చేశాడు.

“నా దగ్గర బి.ఏ. లకు ఏమీ ఉద్యోగాలు లేవయ్యా!”

“నన్ను బి.ఏ.గా గణించకుండా ఉద్యోగం ఇప్పించండి. బి.ఏ. డిగ్రీ నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించేందుకే!”

“నాకు దక్షిణాది బాలకులు బల్లల దగ్గిర తినుబండారాలు అందించేందుకు ఉన్నారు. ఉడిపివారు ఆర్గురూ, ముగ్గురు గుజరాతీ బ్రాహ్మణులూ ఉన్నారు. లెక్కలకు మా సేట్ బాలకులు ఇద్దరున్నారు.”

“నేను బల్ల దగ్గిర అందించకూడదా?”

“సరే ఉండు. మొదట ఆరు రూపాయలకన్నా ఎక్కువ జీతం ఇవ్వలేను. తిండి రెండుపూటలా, ఉదయం ఒక కారమూ, కాఫీ. సాయం కాలం ఒక తీపీ, ఒక కారమూ, కాఫీయున్నూ ఇస్తాము.”

“అంతకన్న భాగ్యం ఏముంది?”

“తక్కిన బాలకులకు ఇరవై, ఇరవై అయిదూ, ముఫ్పైరూపాయలు ఇస్తున్నాను.”

“కావచ్చు. మీ సంస్థలో వాళ్ళు ఉపయోగించినట్లు నేను ఉపయోగించలేను అయినా నాకు అయిదారు రకాల తెలుగుకూరలు, ఎనిమిదిరకాల తెలుగు పచ్చళ్ళు, మూడురకాల తెలుగు పులుసులు చేతనవును. ఎప్పుడైనా చాలా ఆవసరమయితే నన్ను మీరు ఉపయోగించ వచ్చును.