పుట:Konangi by Adavi Bapiraju.pdf/293

ఈ పుట ఆమోదించబడ్డది

అనంతలక్ష్మితో స్నేహితురాండ్రందరూ “వీడు గొప్ప నాట్యవేత్త ఔతాడే అనంతం” అని ఒకబాల, వాడి ఊఁ ఊఁలు విని “వీడు గొప్పసంగీత పాటకుడౌతాడు” అని ఒక సుందరి, ఆ శిశువు పకపక నవ్వటం విని విని, “వీడు తండ్రిలా అల్లరి పిల్లవాడమ్మా!” అని ఒక యోష రంగారావుకు ముద్దులు ముద్దులు బహుమానాలిచ్చినారు.

ఆ మాటలన్నీ వింటూ కోనంగి ఆ బాలికతో “ఇప్పుడే వీడు ఈ నగరంలోని బాలలందరి ముద్దులూ కొట్టేస్తున్నాడు. పెద్దవాడయితే అచ్చంగా గోపికా కృష్ణుడై ఊరుకుంటాడు” అని అన్నాడు. అందరూ గొల్లుమన్నారు. ఒక బాలిక అందరికీ వినీవినబడనట్లు “వట్టి కొంటె కోనంగమ్మా వీడు” అన్నది. ఇంక బయలుదేరాయి చప్పట్లు! మధుసూదనుడు “ఒరే బావా, నీ కొడుకూ కోనంగేనటరా” అన్నాడు. మరీ చప్పట్లు.

పెళ్ళి జయలక్ష్మి ఇంట్లో, చౌధురాణీ చుట్టాలందరూ వచ్చారు. చివరకు చెట్టిగారు కూడా వచ్చి రెడ్డికీ, అనంతలక్ష్మీ కొడుక్కీ బహుమతులు ఇచ్చినారు.

ఆ రాత్రి విందులు అయినవి. స్నేహితులు వెళ్ళిపోయినారు.

శయనమందిరం జయలక్ష్మి స్వయంగా అలంకరించింది.

ఆ మందిరంలోనికి డాక్టరు రెడ్డిని ముందుగా తీసుకువచ్చి కోనంగి ప్రవేశపెట్టాడు. “రెడీ! చౌధురాణి నా కన్నచెల్లెలు వంటిది. ఆమెను నీ స్వంత హృదయగోళంలా, నీ స్వంత మెదడు గోళంలా కాపాడుకో! తెలుసునా?” అన్నాడు.

“లేకపోతే ఏం చేస్తావు?”

“నీ సందేహం అంతా శస్త్రచికిత్స చేస్తాను.”

“నీకేం తెలుసునోయి శస్త్రచికిత్స?”

“నీ సావాసంబట్టి నేర్చుకున్నానులే!”

“అయితే ఆ చికిత్సలో నాదేగా పైచెయ్యి!”

“ముందు వచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడివి!”

ఇద్దరు స్నేహితులు గాఢంగా కౌగలించుకొని విడిపోయారు. కోనంగి నిష్క్రమించాడు.

రెండు నిమిషాలయిన వెనుక అనంతలక్ష్మీ, జయలక్ష్మీ, సరోజినీ, కమలనయనా చౌధురాణీని తీసుకువచ్చారు.

కమలనయన, “రెడ్డి బావగారూ! ఇదిగోనండీ బావకు పన్నీరు!” ఆంటూ అతనిపై పన్నీరువాన కురిపించింది.

“ఇంక 'తన్నేరు' ఎవరు కమలా?” అని కోనంగి గుమ్మం దగ్గర నుంచి కేక వేశాడు.

కమలనయన “ఎవరు? మా అక్కే” అంటూ పైకి పారిపోయింది. అందరూ వెళ్ళి తలుపులు వేసేశారు.

డాక్టరు రెడ్డి గబగబా వచ్చి చౌధురాణి కడ మోకరించి "రాణీ! నూత్న పురుషుణ్ణయి చిన్న బిడ్డలా నీ పాదాల కడ ఉన్నా”ననినాడు.

"డాక్టరుగారూ?” అని ఆ బాలిక ఆతని చేతులుపట్టి లేవనెత్తినది. అత డామెను బిగ్గియగా కౌగలించుకొని పెదవులు ముద్దుపెట్టుకొన్నాడు.

స్వప్న పన్నీ రా దంపతుల ముంచెత్తినది.