పుట:Konangi by Adavi Bapiraju.pdf/285

ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టరు రెడ్డి ఎంత చక్కని హృదయం కలవాడు. కమ్యూనిస్టులు ఖసఖసలాడే విషప్పుచ్చేలనుకొనేది. కాని గాంధీమహాత్ముని తమ్ములని తనకేం తెలుసును? ఒకసారయినా కోపం వస్తే చూద్దాం అనుకొంది. కాని ఆయన ఒక్క విషయంలో నయినా ఖారంగా మాటాడందే!

ఈతడు తన రాజకుమారుడు. తానాతనికి రాజకొమారి. తానూ డాక్టరు విద్య చదవడంకన్న డాక్టర్ని హృదయాన ధరించుకుంటూ, ఆయన మెట్లు ఎక్కుతూ తన్ను చేయిపట్టుకొని నడిపించుకుని పోతూవుంటే తాను ఆయనకు స్నేహితురాలై అనుప్రియురాలై ఆయనకు బాసటయై నడుస్తుందిగాక!

చటుక్కున చౌధురాణీ రెడ్డి వైపునకు తిరిగి “నాకు నర్శింగు నేర్పుతారా?”

రెడ్డి ఉలిక్కిపడి లేచి వెన్నెలలో చంద్రబింబములా వెలిగిపోయే ఆమె మోము చూచి ఆశ్చర్యంతో, ఆనందంతో లేచి ఆమె కుర్చీకడకు వచ్చి ఆమె కుర్చీమీదకు వాలి, “రాణీ! నీకు నేనేమి నేర్పగలను? నువ్వే నాకు ఎన్నో నేర్పాలి!” అన్నాడు.

“నేనేం నేర్పగలను? ఈలా రండి. (ఆ పడకకుర్చీ చేయిచూపించి) ఇక్కడ కూర్చొని జవాబు చెప్పండి.”

రెడ్డి గుండె కలకత్తా మెయిలుబండిలా పరుగెత్తుతూ ఉంటే, ఆ పేము కుర్చీలోనే ఆమెను జరిపి ఆమె పక్కనే జేరుతూ “నువ్వు నేర్పలేని దేమున్నది?” అని అంటూ ఆమె నడుంచుట్టూ చేయిపోనిచ్చాడు. ఆమె కరిగిపోయి, అతని ఒడిలో ఒదిగింది. అతడు ఆమె కళ్ళల్లోకి తేరపార చూస్తూ, ఆ బాలికను రివ్వున ఎత్తి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు.

చౌధురాణీ రెడ్డి మెడచుట్టూ చేతులు చుట్టి “డాక్టరుగారూ!” అన్నది.

“చౌధు!” అంటూ రెడ్డి ఆమె పెదవుల్ని చుంబించాడు.

వారిద్దరి మధ్యా సిగ్గుతెరలు జలజలారాలి క్రిందకు కూలిపోయినాయి. రెడ్డి చౌధురాణీని కోయంబత్తూరు కృష్టయ్యరు హల్వాను ఆస్వాదించినట్టు ఆస్వాదించాడు.

7

1943 మార్చి నెలాఖరున కోనంగిరావుకు అనంతలక్ష్మి గర్భశుక్తి ముక్తాఫలమై పురుషశిశువు జన్మించాడు. పురుడు వచ్చేరోజులని కోనంగికి ఉత్తరం వచ్చినప్పుడు అతడు పడిన ఆవేదన ఇంతింతనికాదు.

ఆరోజునుండి వరుసగా నాలుగురోజులు రాత్రుళ్ళు నిద్దర పట్టక తన జైలుకొట్టులో మతిలేనివానిలా తిరిగేవాడు. పగలు ఏమీ తోచేదికాదు. “పరమాత్మ! నా అనంతాన్ని రక్షించు! కాబోయే శిశువును రక్షించు తండ్రీ” అని నిరంతరము ప్రార్థన చేసేవాడు. ఇంతలో “పుత్రుడు పుట్టినాడు, తల్లి, పిల్లవాడు క్షేమంగా ఉన్నారు. ఏమీ ఆదుర్దా పడవద్దురెడ్డి” అన్న తంతివార్త వచ్చిన తరువాత కోనంగికి ఆనందంచేత కళ్ళలో నీరు తిరిగినవి.

ఆ దినమున జైలు అధికారి ఉత్తరువుకొని, జైలులో అందరికి మిఠాయిలు పంచిపెట్టినాడు కోనంగి.

ఆ మర్నాడు ఉత్తరం వచ్చింది సరోజిని నుంచి “అన్నయ్యా! నీ కొడుకు బంగారుముద్ద! ఎంత ఒత్తుగా నల్లగా వుంది జుట్టు! ఆచ్చంగా నీ పోలికే. కళ్ళుమాత్రం తల్లివిసుమా, ఎంతో ఆకలివేసిన వానిలా తల్లి పాలుపుణుక్కుంటున్నాడు. కెవ్వు కెవ్వున ఇల్లంతా ఎగరగొడ్డాడు ఆకలివేస్తే. నువ్వు వచ్చిందాకా నామకరణం, బారసాల ఆపుతాము.