పుట:Konangi by Adavi Bapiraju.pdf/279

ఈ పుట ఆమోదించబడ్డది

సర్వలోకములు సర్వవిశ్వములు

ప్రేమదేవి నా మోక్షము సర్వము

ప్రేమదేవి నా చిట్టిభార్యయే!”

అని పాడినారు. తానే వారి స్వప్నమట! తన్ను స్వప్నప్రియ అనిపిలుస్తూ తన చుబుకముపట్టి కళ్ళల్లోకి తేరిపార చూస్తూ “దేవీ! నీ నీలిపాపలలో ఎన్నో కలలు, కుసుమ వాటికలు నిర్మించుకొని వాసం చేస్తున్నాయి. ఆ స్వప్న కుసుమాలు ఒక మనోహరమాల నిర్మించి నా మెళ్ళోవేయవా?” అన్నారు.

వారి మధుర మందహాసాలో స్వప్నాలు యెలా స్వానందంచేస్తూ ఉంటాయి. ఆ స్వప్నాలు “నాకు వరమివ్వండీ!” అని తానొకనాడు అడిగితే “సరే, వరమిచ్చినాను. ఇవిగో” అంటూ తన పెదవులపై కొన్ని వందల ముద్దులు కురిపించినారు. ఎంత అల్లరివారు వారు.

లోకం అంతా ఒకటైన స్వప్నం. లోకంలో జాతి మత విభేదంలేని స్వప్నం. లోకంలో ఆస్తిపాస్తులు సమమయిన స్వప్నం. లోకంలో ద్వేషంలేని స్వప్నం. లోకంలో యుద్దంలేని స్వప్నం తేడాలు ప్రకృతి సిద్దమయినవేకాని, మానసిక సిద్దమయినవి కాని స్వప్నం. ఈ స్వప్నాలు నిజమయే పవిత్రదినం త్వరగా వచ్చే స్వప్నం. అవి వారి స్వప్నాలట. ఆ స్వప్నాలు ముద్దులతో తనకు అర్పించినారట. అవి వారి పూజట. అవే కుసుమాలట. అక్షతలట. ఆరతి అట.

తాను వారూ కలసి, తమ చిన్నబిడ్డ ముందు నడవ ఈ జగత్తు అంతా తమ ఆశయమై ఆ మూత్తమ స్థితికి ముందుకు సాగిపోవాలి. తనకూ వారికి ఉద్భవించిన బాలబాలికలు “జయ భారతమాతా, జయ లోకమాతా” అని ముందుకు సాగిపోవాలి. ఆ పోలీసువారి గదిలో తానూవారూ ఒంటరిగా ఉన్నప్పుడు వారు వేలూరు వెళ్ళక ముందు, వారు తన్ను హృదయానికి అదుముకొని, “నా హృదయేశ్వరీ! ఈ నీగర్భములో మన ఇరువురి చిన్నారి శిశువు ఉన్నది. నువ్వు ఎంత అదృష్టవంతురాలవు. నువ్వే ఆ శిశువును గర్భంలో నిన్నే ఆహారం అర్పించుకొంటూ పెంచుతావు. ఈవలకు వచ్చిన వెనుక నాకు ప్రియతమమయిన ఆ మేలిమి బంగారు కలశాలలోని స్వచ్ఛాంబువులు యిచ్చి పెంచుతావు. నేనేమి ఆ శిశువుకు ఈయగలను? ఆ శిశువుకు బలం నా ముద్దుల ద్వారా నీకు అర్పించుకోగలను” అని అంటూ పయ్యెద సవరించి, బాడీని తొలగించి, “బంగారు బంతులగు ఈ నీలిపిందెలు ఆ అమృతము ఆ శిశువునకు అర్పించడానికేనట!” అని అంటూ వాటిని కళ్ళతో తాగి చుంబించినారు. చీకటి రాత్రి జవరాలట, పతిని పొందిన యోష వెన్నెల రేయియట. గర్భవతి ప్రత్యూషమట. శిశువును ఒడిని తాల్చిన తల్లి హృదయమట.

తన గురువు అంశ తనలో ప్రత్యక్షమయింది. ఎంత విచిత్రసంఘటన. ప్రేయసి అంశ ప్రియునిలో ప్రత్యక్షమయ్యే దివ్యభాగ్యము పురుషులకు లేదట. పురుషులు దౌర్భాగ్యులట! అని అన్నారు.

తనలో లోకాలలోని తీపులన్నీ మూర్తించి ఇమిడిపోయినాయి. ఆ మధురాలు ధరించిన పాలసముద్రం తానట. అది మధించే సురాసురులూ తామేనట. అమృతము తల్లులూ బిడ్డలూనట. ఆయన అంతటితో వెళ్ళిపోయినారు. వెళ్ళలేక వెళ్ళినారు. ఆయన ఉత్తరాలా, కావ్యాలే అవి.