ఈ పుట ఆమోదించబడ్డది

కలిపి, సన్నెకల్లులో నూరి వడబోసి స్పటికశిల చెక్కిన బాలికారూపంగల సీసాలో పోసి ఉంచిన దివ్యవర్ణం.

ఆ బాలిక గొంతుకలో ఏ నాదం వేద్దామా అని సృష్టికర్త చాలా సేపు ఆలోచించాడు. తోచక సరస్వతిని సలహా అడిగాడు. “పోనీలెద్దురూ, కోటిగొంతులు సెకండుకు చేయగల మీరు ఈ గొంతుకకోసం ఎందుకంత తంటా అంట?” అని ఆమె చిరునవ్వుతో పెదవులు ముడుచు కుంటూ పొడిగిస్తూ అంది.

ఆ ఆదికాలపు ముసలాయనకు హృదయం జల్లుమంది కాబోలు! ఆమె పెదవులు రెండూ ముద్దెట్టుకోడం మొదలుపెట్టేసరికి ఆ ముద్దులలో నుంచి ఒక స్వనం. ఆమె కరిగి వివశయైంది కాబోలు. అప్పుడామె కంఠంలోనుంచి ఒక కూజీతం. ఆమె చేయి ఆ వివశత్వంలో తన వీణను మీటుతూ వుంటే ఒక కలరుతం ఉద్బవిల్లి, ఆ మూడూ కలిసిపోయి వారిద్దరికీ మరింత పరవశత్వం కలిగించి ప్రవహించివచ్చి అనంతలక్ష్మి కంఠంలో చేరాయి.

2

ఇదేమిటి? ఆ బాలకుడు తన హృదయంలోంచి పోడేమిటి? పోనీ పగలు చూచి ఉండలేదే అతని రూపం, తన హృదయంలో ఛాయా చిత్రమై అచ్చుపడిపోవడానికీ! తనకు ఏర్పాటయిన పాఠ్యగ్రంథ నవలలో, తాను ప్రీతితో చదువుకునే నవలలో, చిన్న కథలలో నాటకాలలో ఎంతగానో వర్ణింపబడిన ప్రేమ అనే జబ్బుతనకూ ప్రవేశించింది. ఎవరు తనకు వైద్యం చేసేవాళ్ళు?

ఎక్కడైనా ఉంటుందా ప్రేమ? ఎవరో? ఏమిటో? ఎందుకో? ఎలాగో? ఎక్కడనుంచి? ఎక్కడికి? అనే ప్రశ్నలకు సదుత్తరాలు లేకుండా 1939-వ సంవత్సరంలో చదువుకొనే అతినవీన బాలిక ప్రేమించడం సంభవమా? కాని సంభవమై ఊరుకుందే! దీనివల్ల వచ్చే సంఘటనలు ఆ మన్మధునికి తెలుసునా?

రాత్రల్లో అనంతలక్ష్మికి నిద్దర సరిగా పట్టలేదు. పైగా కలలు. ఆ యువకుడు మోటారులోకి తన్ను తోసేసి వచ్చి కూచున్నాడట. తానే నడపడం ప్రారంభించాడుట. తో నాతనిదగ్గిర కూర్చున్నదట. తాను అతన్ని ఆనుకుని. అతనిలోనుంచి తనలోనికి ప్రవహించే ఏదో విచిత్ర శక్తికి పరవశత్వం పొందుతూ అ కారువేగం అనుభవిస్తోంది. తల్లి తన్ను వెనక సీటులోనికి లాగేద్దామని ప్రయత్నమట. ఇంతట్లో తమ మోటారు విమానమై ఎగరడం ప్రారంభించిందట. తామిద్దరూ విమానంలో వెనకాల కూర్చుని ఒకరి కౌగిలిలో ఒకరు ఒరిగిపోయి, అర్థంలేని నవయవ్వనపు పిచ్చి మాటలు మాట్లాడు కుంటున్నారట. తనతల్లే వైమానికుడై విమానం నడుపుతున్నదట.

ఉదయం అనంతలక్ష్మి పరధ్యానంగా ఉంది. జయలక్ష్మీ వచ్చికూతుర్ని చూచి, “ఏమే అమ్మణ్ణి, పరధ్యానంగా ఉన్నావు?” అని ప్రశ్నించింది.

అనం: నేను పరధ్యానంగా ఉన్నానా?

జయ: అంత బడలికగా ఉన్నావేమిటే?

అనం: నేను బడలికగా ఉన్నట్టు కనబడుతున్నానా?

జయ: అవునే అమ్మట్లే! వంట్లో బాగుందా?

అనం: ఏమీ జబ్బులేదు అమ్మా! రాత్రి సరిగ్గా నిద్రలేక అల్లా ఉంది.