పుట:Konangi by Adavi Bapiraju.pdf/240

ఈ పుట ఆమోదించబడ్డది

“ఈ విషయం రియాసత్ కూడా గ్రహించాడు. తక్కిన వారెవరికీ ఇంకా అనుమానాలు తట్టలేదనుకుంటాను.”

“కానీ ఆమె ఉద్దేశం?”

“ఓయి నీయిల్లు బంగారంకానూ! పదిహేనురోజులు కాలేదు, నాయిక అవతరించి! ఏమి ప్రేమవేదన! వారేవా!”

6

డాక్టరు రెడ్డికి ప్రేమ దావానలంలా, ఉప్పెనలా, తుపానులా వచ్చిపడింది. రోగుల్ని పరీక్షిస్తూ ఉంటే చౌధురాణీ ఎదురుగుండా దర్శనమిస్తుంది. ఎవరికైనా ఇంజెక్షన్ ఇస్తోంటే, రాణికే ఇంజక్షను ఇస్తున్నానని భయపడతాడు. తాను పెద్ద శుకమహర్షికాడు. తనది సదోపవాసి బ్రహ్మ చర్యం. అప్పుడప్పుడు దేహం కామవాంఛాపూరితం అయినప్పుడు ఏ నర్సునో, ఏ సినీమా తారనో, ఏ ఆమెనో తన పడకగదికి రప్పించుకొనేవాడు. ఏమైనా శుభ్రభావం కలవారు కాబట్టిన్నీ, కొంచెం రసవాది అవటంవల్లనూ అందమయిన యువతులను, ఆరోగ్యాలను ఏరుకొనేవాడు. వారికి కామతృప్తి, ధనతృప్తి బాగా కలిగించేవాడు.

అతని స్నేహితులకు ఈ విషయం తెలుసును. కాని తక్కినవారికి ఏమీ తెలియదు. కొందరు మాత్రం ఏ సన్యాసోతక్క తక్కిన మానవ మాత్రులు బ్రహ్మచర్యం అవలంబించలేరు అని నమ్మేవారు. “అమ్మో! డాక్టరు అలా కనబడతారు! లోతునీళ్ళు అతి నిర్మలం' అని అంటారు.

వెనుక రోజుకోసారో లేక రెండురోజుల కొకపర్యాయమో పత్రికా కార్యాలయానికి వచ్చే డాక్టరు, ఈ మధ్య రోజుకు రెండుమాట్లు, మూడుమాట్లూ రావడమో, లేకపోతే వచ్చినప్పుడు రెండుగంటలపాటు వరసగా వ్రాస్తూ తన కాలం ఉపయోగించడమో ప్రారంభించాడు.

కోనంగి నవ్వుకుంటూ రెడ్డితో “కాలజ్ఞానము లేనివారుగదరా కామాస్త్ర సంపీడితుల్” అన్నాడు.

రెడ్డి నవ్వుతూ, “నాయనా, ఈ ప్రేమ అనేది మా చెడ్డవస్తువులా కనబడుతోందే! నా మతి పోగొట్టింది ఆమె దేహం కాదు, ఆమె అందం కాదోయి నా మతిపోగొడ్డా. ఆమే. ఆమె సర్వస్వమే!” అన్నాడు.

“ఓ పిచ్చివాడా! నన్ను ఆరోజుల్లో పిచ్చివాడనని వేళాకోళం చేశావ్. ఈ రోజున తెలిసిందేం! 'తనవరకూ వస్తేగాని ధర్మాలకు అర్థాలుండవు' అన్నమాట వృధా అనుకున్నావా?”

“ఆ బాలికలో ఏమి ఉంది? నన్ను మతి లేనివాణ్ణి చేసి పారవేసిందే!”

“నిన్ను మతిలేనివాణ్ణిగా తయారుచేసే శక్తి ఉంది.”

“నా మాట ఎప్పుడయినా వస్తుందా?”

“నీ మాట అక్కడ ఎందుకు వినబడుతుంది మాకు! నువ్వు వస్తే వినబడుతుంది.”

“సంతోషించాములే! ఆ బాలిక ఎప్పుడయినా తెస్తుందా?”

“ఆ బాలిక నీ మాట ఎందుకు తీసుకురావాలి?”

“నేను ఆ బాలిక మాట తీసుకురావటంలేదా?”