పుట:Konangi by Adavi Bapiraju.pdf/228

ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగి: ప్రపంచ స్త్రీల వార్తలు, స్త్రీల హక్కుల వ్యాసాలూ-మా చెల్లెలుగారు డయనమో!

మధు: అన్ని మహిళా సమాజాల నుండి వార్తలే!

కోనంగి: మనం ప్రస్తుతం వ్యాసాలు వ్రాసే సోదరీమణులకూ, వార్తలు పంపే మహిళామణులకూ ఏదో కొంచెం ముట్టచెప్పాలి. ఏమంటావయ్యా రియాసత్?

రియా: అట్లాగే ప్రారంభిద్దాము.

దినపత్రిక ఒక పెద్ద సంస్లే పేపరుకి సాయంకాలం ప్రచురణ సంచికలు కట్టలుగా రైల్వే పార్సిళ్ళుగా వెళ్ళాలి. విడి సంచికలు పోస్టాఫీసుకు పోవాలి. ఉదయం సంచికలు పట్టణంలో అమ్మకానికి.

చెన్ననగరమంతా ఏజంట్లను పెట్టినారు. పత్రిక అంతకన్న అంతకన్న స్త్రీలు ఎక్కువ కొనుక్కొనసాగించారు దినదినమూ, స్త్రీలకోసం యేర్పడిన దినపత్రిక ప్రపంచంలో ఇంకోటిలేదు. ఇంతవరకు స్త్రీలు వార్తాహరులుగా పాశ్చాత్యదేశాలలో ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు “నవజ్యోతి” ఆంధ్రభాషలో వార్తాహరులను ఏర్పాటు చేయగలిగింది. అంతకన్న అంతకన్న కార్యాలయంలో స్త్రీభాగం పెద్దది చేయవలసి వచ్చింది, ఇద్దరు ఉప సంపాదకురాండ్రు పనిచేస్తున్నారు.

పత్రికకు టెలిప్రింటరు సంపాదించారు. ఆడవాళ్ళు తలుచుకుంటే, రాయిటరు ఏజంట్లూ గీజంట్లూ ఆగుతారా?

2

జపాను యుద్ధంలో ఉరికింది. ఆ మర్నాడు అమెరికా యుద్ధం ప్రకటించింది. వెంటనే జర్మనీ ఇటలీలు అమెరికామీద యుద్ధం ప్రకటించాయి.

“అమెరికా యుద్ధంలోకి రావడంయొక్క పరమార్ధం వీరభద్రుడు దక్షయజ్ఞంలోకి ఉరకడం అన్నమాటే! హనుమంతుడు అశోకవనంలోకి దూకడం అన్నమాటే' అని కోనంగి సంపాదకీయం వ్రాశాడు.

ప్రపంచ రాజకీయాలు, భారతీయ రాజకీయాలు కోనంగి ఎల్లా అర్థం చేసుకున్నాడో! అనంతలక్ష్మి తన చదువు కాగానే భర్త ఒళ్ళోకి వాలుతుంది. కోనంగీ, అనంతమూ నిత్య ప్రేమికులయిపోయారు. అనంతం భర్తను ప్రపంచ రాజకీయాలు అడుగుతుంది. భార్యకు రాజకీయాలు చెప్పుతూ కోనంగి తన భావాలను స్పష్టం చేసుకుంటాడు. మాటలలో అతనికి కొత్త కొత్త భావాలు వస్తూ ఉంటాయి. తన నూత్నోద్భవ భావాలకు తానే ఆశ్చర్యం పొందుతాడు. అవి విపులం చేస్తాడు అనంతలక్ష్మికి పాఠం చెప్పినట్లు.

అనంతలక్ష్మికి పాఠం చెబుతోంటే వారిద్దరూ బ్రహ్మ సరస్వతులౌతారు. లోకాన్ని దర్శిస్తూ వారిద్దరూ లక్ష్మీనారాయణులౌతారు. వారి ప్రేమలో వారు అర్ధనారీశ్వరులౌతారు.

“అనంతం! ఉదయం కార్యాలయానికి పోతానా-అక్కడ ఒంటిగంట వరకూ, జనరల్ మేనేజరు, మీ అన్నయ్య అయ్యంగారున్నారే ఆయనా, నేనూ పత్రికల పంపకం వగయిరా వ్యాపారాలన్నీ వివిధశాఖల వారితో సంప్రతించి ఏర్పాట్లు చేసుకుంటాము. ఒంటిగంటకు అత్తగారు పంపిన ఉపాహారం అందుతుంది. రెండుగంటల నుండీ మూడువరకు దినపత్రికలు చదువుతాను. ఈలోగా రేడియో వార్తలు వింటాను. మూడుగంటల నుండి అరగంటలో వచ్చిన వార్తలూ, అందులో పత్రికలలోకి తర్జుమా అయిన వార్తలూ చూస్తాను. ఒక ముఖ్య విషయం ఏరుకొని అరగంటలో సంపాదకీయం దంచేస్తాను. ఇంత చేస్తున్నా నా జీవిత సామ్రాజ్ఞి నా ఎదుటే?”