పుట:Konangi by Adavi Bapiraju.pdf/223

ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగి: దానికి మా అనంతమే కారణభూతురాలు. ఆవిడగారు నన్ను ఒక తెలుగు దినపత్రిక పెట్టమంటూంది. ఇదివరకే స్థాపితమై నేడు భూస్థాపితమయినంత పనైన ఒక దినపత్రికను నామకః డబ్బుపెట్టి కొనమంది.

డాక్టరు: పెట్టుబడి?

కోనంగి: తాను ఒక లక్షరూపాయలు పెట్టుబడి పెడుతుందట!

డాక్టర్: వారేవా! కాని ఏదో పనిచేయి. నీ దృష్టిలో నూతన దృక్పథం తీసుకురా. ఆ పేపరు పేరు?

కోనంగి: “నవజ్యోతి” ఆ పేపరు 1936లో బయలుదేరి 1937లో తొంగుంది. అందుకు సంబంధించినవన్నీ అమ్ముడుపోయాయి. పేరు మిగిలింది. కంపెనీ లిక్విడేటు కాలేదు. మా అనంతం క్లాసుమేటు స్నేహితురాలిని తీసుకొనిపోయి, ఆ అమ్మాయి తండ్రి ప్రభుత్వ అడ్వైజరీగారిని సలహా అడిగింది. ఆయనా కాగితం 'కోటా' (వంతు) ఇప్పిస్తానన్నాడు.

కోనంగి డాక్టరుగారితో అన్న ముక్కలు నిజమే! దినపత్రిక పెట్టడం చాలా ముఖ్య మనుకున్నాడు. ఏ రాజకీయ పక్షంవైపు మొగ్గకుండా ఉండడం మొదటిరోజులలో, తర్వాత “అటునుంచి ఇటు నరుక్కురమ్మన్నాడు” అనుకున్నాడు.

పేపరు జయలక్ష్మి అనంతలక్ష్ముల పేరను కొనవలసి వచ్చింది. పత్రికామందిరానికి హారిసరోడ్డులో ఒక పెద్ద మేడిల్లు అద్దెకు పుచ్చుకున్నాడు. డాక్టరుగారి సహాయంతో ఒక చిన్న రోటరీ మిషను రెండు వేలకు కొన్నాడు.

రియాసత్ ఆలీ అడ్వర్టైజ్ మెంటు మేనేజరు పని చేసేవాడు. అనంతలక్ష్మి కోనంగిరావులు సంపాదకులు. మధుసూదనరావు మేనేజరయ్యాడు. ఇతర ఆంధ్ర దినపత్రికలలో పనిచేసే ఇంకొక పెద్దమనిషి సుబ్బారావుగారు వార్తా సంపాదకుడు. ఇంకా ఇద్దరు అనుభవంగల యువకులు ఉపసంపాదకులయ్యారు.

అనంతలక్ష్మి స్నేహితురాండ్రూ కారులమీద పోయి నెలరోజుల వరకు ప్రకటనలు రోజుకు పదిహేను నుండి ముప్పటివరకూ వచ్చే ప్రకటనలు పట్టుకువచ్చారు.

జయలక్ష్మి తాను బాగా ఎరిగిన అరవయ్యంగారు జ్యోతిష్కుని ఒకరిని పట్టుకొని ముహూర్తం పెట్టించింది.

హారిస్ రోడ్డులోని “నవజ్యోతి కార్యాలయానికి అన్నీ జేర్చి, ఆ కార్యాలయం సిద్ధం చేసేటప్పటికి 1941 సెప్టెంబరు నెలాఖరయింది.

టైపు ఏది పెట్టాలని వాదన వచ్చింది. పాయింటుటైపు అందం అంటాడు డాక్టర్ గారు. మధుసూదనుడు పూర్వకాలపు జి.పి., ఇంగ్లీషు బాడీలు ఉత్తమం అంటాడు.

చివరకు డాక్టర్ గారి మాటే నెగ్గింది. టైపు కేసులు వచ్చాయి. కంపోజిటర్లు చేరారు. అక్టోబరు నెలలో ప్రారంభ ముహూర్తం.

10

వెనుకటి 1914 ప్రపంచయుద్ధానికీ, ఈనాటి ఈ రెండవ ప్రపంచ యుద్ధానికీ ఎంతో తేడా ఉంది.

వెనుకటి యుద్దానికీ ఈ యుద్దానికీ పోలికలు కొన్ని ఉన్నాయి.

1. ఆ యుద్దమూ ఈ యుద్ధమూ ప్రారంభించిన మహానుభావులు జర్మనీవారు.

2. ఈ రెండు యుద్ధాల్లో ఇంగ్లీషువారూ, ఫ్రెంచివారూ మిత్రమండలి ఆయ్యారు.