పుట:Konangi by Adavi Bapiraju.pdf/220

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వేషదుర్గముపైన విజయయాత్రకు పోయి

క్రోధకుడ్యములెల్ల కూత్తు ప్రేమాస్త్రముల (రూ)

ఆటపాటల ప్రేమ అందాలపై ప్రేమ

కాటుకలదిద్దేటి కళలపై తన ప్రేమ (రూ)

ప్రణయలీలా నృత్యళ్ళంగారనాయకీ

పంచమస్వనరాగ భావగీతిక ప్రేమ (రూ)

బంగారు శిశువు ఒడిని పాలిచ్చు సుత ప్రేమ

పతికి పరిచర్యలిడు పరమసతియై ప్రేమ (రూ)

ఆర్తికై కుందేటి అమృత ప్రేమాప్లవిత

అఖిల లోకద్వేష మాహుతించే దేవి (రూ)

ఆ పాట కోనంగి మాయామాళవగౌళ రాగంలో పాడుతూ, సర్వలోకమూ మరచి, తన అనంతలక్ష్మినే చూస్తూ దివ్యభావాలతో కరగిపోయి కన్నుల నీరు నిండ నిలిచిపోనాడు.

అందరికీ కన్నుల నీరు తిరిగాయి. అనంతలక్ష్మి భర్తపై నిరవధిక ప్రేమ తన్ను ముంచెత్త కళ్ళల్లో తన గంభీరపూజ జ్యోత్స్నాకాంతిలా ప్రవహింప, లేచి వేగంగా నడచిపోయి తన పడకగదిలో మంచంమీద వాలి పోయింది.

కోనంగి అనంతలక్ష్మి వెనకాలే వెళ్ళాడు. కోనంగి రెండడుగులలో అనంతలక్ష్మి బోర్లగిల పండుకుని ఉన్న తమ పర్యంకము దగ్గరకు వెళ్ళి“ఏమిటిది అనంతా! ఏమిటి నీ ఆవేదన?” అని ఆతురతతో అడుగుతూ, మూర్తికట్టిన సౌందర్యమైన భార్య నడుముచుట్టూ తన ఎడంచేయి పోనిచ్చి ఆమె భుజాల చుట్టూ తన కుడిచేయి పోనిచ్చి తనవేపుకు తిప్పుకున్నాడు. అనంతలక్ష్మి మధురంగా నవ్వుతూ, కళ్ళనీళ్ళు తుడుచుకొని. భర్త చెంపలదిమి అతని కళ్ళల్లోకి తేరిపార చూచి, “నా గురువుగారూ, నా భగవంతుడు గారూ, మీ పాటకు నా మనస్సు కరిగింది. ఏదో ఆవేదన నన్ను అదిమి వేసింది. ఆనందమూ, ఆవేదనా, అవి రంగరింపులయ్యాయి. మీ అందమయిన, అద్భుతమయిన పాటకూ, మీ అమృత గానానికీ తక్షణం కౌగిలించుకోవాలని బుద్ది పుట్టింది. కాబట్టి ఇక్కడకు వచ్చాను. మీరు నా వెనకాలే వస్తారని నాకు తెలుసును” అంటూ ఆతని మోము తన వక్షానికి అదిమి పట్టి అతని జుట్టు ఆఘ్రాణిస్తూ, అతణ్ణి తనపైకి లాగుకొని గాఢంగా కౌగిలించి పెదవులు చుంబించింది."

కోనంగి, ఆమెను మరీ హృదయానకు అదుముకున్నాడు. తెప్పరిలి ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా మంచంమీద కూర్చున్నారు. కోనంగి తన ఎడంచేయి ఆమె నడుంచుట్టూ వేసి, కుడిచేత్తో ఆమె గడ్డం పట్టి మేమెత్తి, ఆమె కళ్ళల్లోకి పరికిస్తూ.

“ఆవేదన ఏమిటి శిష్యురాలా!” అని ప్రశ్నించాడు.

“లోక శాంతికోసం అంత ఆవేదన ఉందా మీకు?”

“ఎవరికి ఉండదు లక్ష్మీ!”

“మీ పాటవల్ల నాకూ ఓ పెద్దప్రశ్న బయలుదేరింది సుమండీ!”

“ఏమిటది చెప్పు వెన్నెల వెలుగూ!”

“ఎప్పుడూ నవ్విస్తారు. మీకు ముచికుంభత రానే రాదా?”

“ముచికుంభత ఏమిటి ముచికుందుడులాగ?”