పుట:Konangi by Adavi Bapiraju.pdf/215

ఈ పుట ఆమోదించబడ్డది

“ఏమిటండీ ఈ పాశ్చాత్య నాగరికత?”

“పాశ్చాత్య ఏమిటి? ప్రాచ్యమేమిటి? చంపడం భావం వస్తే అందరూ ఒకటే ప్రాణేశ్వరీ! మనదేశంలో పార్టీ కక్షలు, పొలం తగాదాలు వస్తోవుంటాయి చూడలేదూ! భారతీయులు ఎంతోమంది బ్రిటిష్ సైన్యంలో చేరి యుద్దాలు చేయడం లేదూ ప్రియమూర్తీ! గూర్బాలు, పఠానులు, శిక్కులు, పేరు చెప్పితే ప్రపంచంలోనే హడలు.

ఒక రోజున పేపరు చదువుకుంటూ ఆ యవ్వనదంపతులిద్దరూ ఈ సంభాషణలో పడినారు. అనంతలక్ష్మికి బందరు వట్టి మారుమూల స్థలంలా కన్పించింది. వచ్చిన మూడురోజులవరకూ హుషారుగా గడిపారు ఇద్దరూ. సముద్రం ఒడ్డు, జాతీయ కళాశాల, బందరు వీధులూ చూపించాడు. తను ఆడుకున్న స్థలం, తాను చదివిన హిందూ కాలేజీ అన్నీ అనంతానికి చూపించాడు కోనంగి.

“అదియే బొంబాయి, అల్లదే కనుము పట్టాభి మహానాయకుడదియే” అని అతడు ఆశు కవిత్వంగా పాడుతూ అనంతలక్ష్మిని సాయంకాలానికి బందరు కోటకు తీసుకు తీసుకువెళ్ళాడు. ఆ చుట్టుప్రక్కల రాత్రి ఎనిమిదింటి వరకూ తిరిగి, ఇంటికి చేరుకున్నారు.

కోనంగితల్లి పార్వతమ్మ కుమారునితో “నాయనా! నేను నా వంటపని మాని మదరాసు వచ్చి ఏం చెయ్యగలను తండ్రీ! నేను చేసిన మహాదోషానికి నేను అనుభవించాలిరా? నువ్వు సంపాదించి నన్ను సుఖపెట్టాలని వున్నా, నాకు సుఖం ఎక్కడిదిరా? నాకు ప్రపంచం అంతా తారుమారుగా కనబడుతోంది. నువ్వెందుకు వచ్చావో ఈ లోకంలోకి. నీకీ పెళ్ళేమిటో నాకేమీ అర్థంకావటంలేదు. నా బ్రతుకు ఇట్లాగే బ్రతకనీ! తర్వాత ఏది ఎల్లా ఉంటుందో? మీరిద్దరూ త్వరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపొండి” అని విషాదంగా, ఖండితంగా చెప్పింది.

కోనంగికి తల్లి హృదయం అర్థం అయింది. ఆమెకు తాను పుట్టడమే తప్పని అతడనుకొన్నాడు! ఈ విచిత్రమైన భారతదేశంలో జీవితాదర్శాలు, జీవిత భావాలు విచిత్రపథాల ప్రయాణం చేస్తూ వుంటాయి. ఫ్రాయిడ్ మొదలయిన వారి సిద్ధాంతాలన్నీ భారతీయ స్త్రీల విషయంలో వర్తించవు అని అనుకొన్నాడు.

మర్నాడు భార్యాభర్తలు ఇద్దరూ స్నేహితులందరి దగ్గరా సెలవు పుచ్చుకుని వెళ్ళారు. మధుసూదనరావూ, అతని భార్యా, కోనంగీ, అనంతలక్ష్మి కలిసి ఫోటో తీయించుకొన్నారు.

మధుసూదనరావు కోనంగితో ఆ నాలుగయిదు రోజులూ తన విషయం చెప్పుకొని గొంతెత్తి ఏడ్చాడు. “ఒరే కోనంగీ, నా జీవితం వట్టి నిరర్థకం అనుకుంటున్నానురా! యేం చెయ్యను? యుద్దానికి పోదామనుకున్నాను.

“ఏమిటి వ్యాపారం?”

“మాకు ఋణాలు ఎక్కువయితే భూములన్నీ అమ్మేసి అప్పులు తీర్చాం. ఉద్యోగాలు లేవు కొద్దిగా బంగారం ఖరీదు ఎక్కువవడంచేత మాయింట్లో ఉన్న బంగారం అంతా అమ్మేసి కాలక్షేపం చేస్తున్నాము బి.ఏ. పూర్తి చేశాను ఎల్లాగో. ఉద్యోగం? తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు. అమ్మాయిలు మా చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్లు కాలేదు.”

“పెద్దచెల్లెలు చౌధురాణీ బి.ఏ. పూర్తి చేసింది కాదురా?”

“ఆ! రాణీ ఏం చెయ్యాలో తెలియక కొట్టుకుంటోంది. దాన్ని చూస్తే మరీ బెంగ.”

“రాణీని ట్రెయినింగుకు పంపించరాదూ!”