పుట:Konangi by Adavi Bapiraju.pdf/212

ఈ పుట ఆమోదించబడ్డది

5

కోనంగి, అనంతలక్ష్మీ బందరు స్టేషనులో దిగగానే అక్కడకు అతని ఉత్తరం ప్రకారం, అవతల యిచ్చిన టెలిగ్రాం ప్రకారం అతని స్నేహితుడు మధుసూదనరావు స్టేషనుకు కొందరి స్నేహితులతో వచ్చి సిద్ధంగా ఉన్నాడు.

కోనంగి, ఈ రెండేళ్ళలోనూ ఆనవాలు పట్టరానంత మారినట్లు వారికి తోచింది. స్నేహితులందరూ కోనంగిని కౌగలించుకునేవాళ్ళూ, చేతులు జోడించేవాళ్ళూ ఆయి అతనికి స్వాగతం యిచ్చారు. సామాను అదీ తాను వెంట తీసుకువచ్చిన టాక్సీలమీద వేసుకొని మధుసూదనరావు యింటికి వెళ్ళారు.

మధుసూదనరావు కుటుంబమువారు రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు బందరు నోబిలు కాలేజీలో లెక్చరరుగా ఉన్నప్పుడు బ్రహ్మసమాజంలో కలసి కులభ్రష్టులయ్యారు. ముట్నూరి కృష్ణారావుగారు, పట్టాభి సీతారామయ్యగారు మొదలయిన వారితోబాటు మధుసూదనరావుగారి తాత సాంఘిక సంస్కరణలు తన కుటుంబంలో తీసుకువచ్చి కొమరిత పెద్దమనిషి అయిన తర్వాత బొంబాయిలో ప్రభుత్వ వైద్యుడుగానున్న ఒక బ్రహ్మ సమాజికునకిచ్చి వివాహం చేశాడు. ఆ మధుసూదనరావుగారి మనుమడు ఈ మధుసూదనరావు. కోనంగి వివాహానికి కూడా వచ్చి ఉన్నాడు. అప్పుడే భార్యాభర్తల నిద్దరినీ బందరు రావలసిందని ఆహ్వానించాడు.

కోనంగి స్నేహితులు, మధుసూదనుడు కోనంగి భార్య అత్యంత రూపవతి అని చెప్పడం విన్నారుకాని, ఇంత సౌందర్యవతి అని వారనుకోలేదు.

బచ్చుపేటలో ఉన్న మధుసూదనరావు ఇంటికిపోయి, తన కేర్పాటయిన గదిలో సామాను సర్దుకొని, స్నానాదికాలు నిర్వర్తించి వారందరితో భోజనం చేసిన వెనుక పన్నెండు గంటలకు ఒక జట్కా తల్లి కోసం పంపించాడు కోనంగి.

ఇదివరకే కొడుకూ కోడలూ వస్తున్నారని ఆమెకు తెలియగానే తబ్బిబ్బయిపోయింది కోనంగి తల్లి పార్వతమ్మగారు. ఏదో తన బ్రతుకు తాను బ్రతుకుతూ వుంది. ఇప్పుడు వీడు రావడమేమిటి? వాడు ఒక్కడూ వచ్చి తనును చూచి వెళ్ళిపోయినా తనకు అంత ఇబ్బంది ఉండేది కాదు. ఎవరో కులం తక్కువ అమ్మాయిని చేసుకొని, ఆ పిల్లను కూడా తీసుకు వస్తాడట.

ఆమె నిజచరిత్ర ఎవరికి తెలుస్తుందో అని భయం. కొడుకు మదరాసులో ఉండి ఏదో సినీమా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని పదిమందికీ తెలిసినా, ఆమె అంత కంగారు పడలేదు.

ఇవాళ తన కొడుకూ, తన కొడుకు పెళ్ళి చేసుకున్న ఆ పిల్లా వచ్చారనీ, వెంటనే జట్కా ఎక్కిరమ్మన్నారనీ కబురు రాగానే బేజారైపోయింది. మధుసూదనరావు తనింట్లోనే కోనంగిరావూ, అతని భార్య ఉంటారని చెప్పినప్పుడే, ఈ బ్రహ్మసమాజంగాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళినా తంటే, వెళ్ళకపోయినా తంటే అనుకుంది.

ఇప్పుడు తన్ను రమ్మంటున్నారు కొడుకూ కోడలూ ఇద్దరూ అని కబురూ బండి రాగానే తన కొడుకు ఫలానా వారింటిలో ఉన్నాడని తెలియగానే, తాను వంటచేసే కుటుంబం యజమానురాలూ, ఆమె చుట్టాలూ ఏమనుకుంటారో అని గజగజలాడి

202

అడివి బాపిరాజు రచనలు - 5