పుట:Konangi by Adavi Bapiraju.pdf/201

ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె ఆ ఉత్తరం రెండు మూడుసార్లు చదువుకుంది. తాను భర్తపై వ్రాసుకొన్న పాట గొంతెత్తి కచ్చేరి చేస్తునట్టు పాడుకొన ప్రారంభించింది.

“ఎవరోయి నువ్వూ

ఎదర చేరావూ?

ఎవరో నీ పాట

భువనాలు ఎగురుతూ

నా బ్రతుకులో కలిసి

నన్నె పాటను చేసె?

ఎవరేయి నీ నవ్వు

ఏడు లోకాలలో

ఆనంద ఝరులుగా

ఐక్యమయినది నన్ను?

ఎవరోయి నీ చూపు

ఇనుని కిరణాలవుతు

విశ్వతేజస్సవుతు

వెలిగించే నా బ్రతుకు

దశమ పథం

యుద్ధ ప్రళయం

హిట్లర్ రష్యామీద విరుచుకుపడి ముందుకు సాగిపోతూ ఉన్నాడు.

రష్యా ఇంగ్లండులు ఒకదాని కొకటి సహాయం చేసుకొనడానికీ, జర్మనీ సంపూర్ణంగా ఓడిపోయి కాళ్ళమీద పడేటంతవరకూ ఏ విధమయిన సంధీ జర్మనీతో చేసుకొనకుండా ఉండడానికీ, ఇద్దరూ కలిసే ఏపనైనా చేయడానికి, ఒకరికి తెలియకుండా ఒకరు ఏవిధమైన సంధీ ఎవ్వరితోనూ చేసుకొనకుండా ఉండడానికీ సమాధానానికి వచ్చారు.

రష్యా స్నేహంనమ్మి తాను పడమటి రాజ్యాలలో యుద్ధం చేస్తూ ఉంటే, రష్యా బెసరేబియా ఆక్రమించి, యుగోస్లేవియా మద్దతు చేసి. ఎస్తోనియా, లిథుయోనియాలను ఆక్రమించి తనమీద భయంకర ద్రోహం చేసిందనీ, తాను ఇతర దేశాలతో యుద్ధం చేసే ఈ సమయంలో తన వెనుకనుంచి విడుచుకుపడి జర్మనీని నాశనంచేయ చూస్తూందనీ, అసలు పోలండు యుద్ధంలోనే నమ్మకద్రోహం చేసి పోలండును సగం ఆక్రమించుకుందనీ, అలాంటి ద్రోహం చేసినా కూడా తాను ఊరకున్నాననీ హిట్లర్ ప్రకటించాడు.

జర్మనీ సైన్యాలు పోలండును ఆక్రమించాయి. లిథుయోనియా, ఎస్టోనియాలను ఆక్రమించాయి స్మాలెంస్కు అయిపోయింది. మాస్కోమీదకు చొచ్చుకుపోతున్నాయి.

రష్యామీదకు యెప్పుడు జర్మనీ విరుచుకుపడిందో, ఆ మరుక్షణమే కమ్యూనిస్టుల కందరకూ జర్మనీమీద ప్రళయరుద్రుని కోపం వచ్చింది. కమ్యూనిస్టుపార్టీ నాయకులు పైన ఉన్నవారు ఈ యుద్ధం ప్రజాయుద్ధం అన్నారు. 'ప్రజాయుద్ధం' అనే వారపత్రిక