పుట:Konangi by Adavi Bapiraju.pdf/200

ఈ పుట ఆమోదించబడ్డది

నిన్ను నాకు విద్య చెప్పిన గురువులలో చూచాను. నన్ను కలిపివేసిన సంగీతంలో నిన్ను విన్నాను. నన్ను కదిలించి వేసిన కవిత్వంలో నిన్ను అనుభవించాను. గాంధీ మహాత్ముని బోధనలో నీ దేశికత్వం అనుభవించాను; మహాపురుషుల జీవితాలలో నీ నృత్యం చవిగొన్నాను. బీదల అరువులో నీ ఆవేదన విని దుఃఖించాను. రష్యాదేశ విజృంభణలో నీ ఆనందం చూచి అందులో లయమయిపోయాను దేవీ! నువ్వు ఎక్కడ ఉన్నావో అని వెదికాను.

"నాకు యవ్వనం వచ్చిన ప్రథమ దినాలలో, బాలికలు నాకు అప్సరసలై కనిపించే కాంక్షాపూరిత గడియలలో నువ్వు కనపడక తలవాల్చి ముందుకు సాగిపోయాను.

“నాకు పరీక్షలు పూర్తయి జీవితమార్గం వెదకుకొనే రోజులలో నిన్ను దూరాన చూస్తూ, నీ అడుగుల మంజుల కింకిణీరవాలు దూరాన వింటూ, ఎక్కడ? ఎక్కడ? అని వెదకినాను. ఆ మధురస్వనమే నన్ను నీ దగ్గరకు తీసుకొని వచ్చింది.

“దేవీ! పురుషుడు స్త్రీకీ, స్త్రీ పురుషునకూ ఉపాస్యదైవములు కావాలి. ఈ పూజే మనుష్యుని పశుత్వంలోంచి తప్పించి ఉత్తమ మానవుణ్ణి చేస్తుంది.

"వివాహం అంత పవిత్రమైనది కాబోలు! నిన్ను ప్రేమించి ప్రేమించి నీ స్థితి నా స్థితికన్న ఎక్కడో పైన ఉండడం తలచుకొని, తలచుకొని బాధపడి నిన్ను నా దేవిగా మాత్రం ఎంచి ఉండాలనుకొన్న నాకు నీ హస్తం పట్టి నిన్ను అగ్నిసాక్షిగా అర్ధదేహముగా ఏర్పాటు చేసుకోవడం నాకెంతో ఆనందం సమకూర్చింది. వివాహమాడి నీ చేయిబట్టి ఏడడుగులు నడిచి నిన్ను రాత్రి హృదయాన కదుముకొని ఇది నిజమా అని ఆశ్చర్యంలో మునిగి నా అదృష్టానికీ, నిన్ను చేపట్టగల నా ప్రజ్ఞకూ ఆనందపూర్ణుడనై పోయినాను.

“నాలోని ఆశయ దేవతా, నువ్వూ ఏకమైపోయారు. లోక ప్రేమ చరిత్రలో మన ప్రేమ ఒక ప్రత్యేక ప్రకరణం కాదూ లక్ష్మి!

“నువ్వు లక్ష్మీవే! నా హృదయమే కమలము. నా జీవితమే కమలము. అందులో నువ్వు కమలాలయవై ఉంటావు. నా శక్తి, నా విద్య, నా హృదయము, నా మెదడు నాలుగు ఏనుగులై, నిన్ను పూర్ణకుంభాలలో అమృతం కురిపిస్తూ పూజిస్తాయి.

“ఓ దివ్యనవమోహనాంగీ, నువ్వే నా చేయి పట్టుకొని ఈ బ్రతుకు దారులలో నడిపించుకుపో. ఓ మహామధుర పరీమళాంగీ! అద్భుత సౌందర్య రేఖా సమన్విత జగన్మోహినీ! నీ ప్రేమచే నేను పవిత్రుణ్ణి. నిన్ను ప్రేమించడంచేత శక్తిమంతుణ్యి నీతో ఈ విశాల జగత్తులో నడుస్తాను.

“మనం ఇద్దరము మానవ సేవాశయ పవిత్ర క్షేత్రానికి పోదాం!

ఇట్లు

నీ పదపద్మాలు

హృదయాన ధరించు

కోనంగి.”

ఈ ఉత్తరం చదువుతూ అనంతలక్ష్మి కన్నుల నీరు నింపుకొని సోఫాలో కూలిపోయింది.

తన ప్రభువు ఎంతటి ఉదారభావాలతో తన్ను ముంచెత్తుతున్నాడు.

అవును. వారు చెప్పినట్లు ఆయన్ను అర్ధాంధకారంలో చూచిననాడే గుండె గుభిల్లుమంది. ఏనాడో చూచిన పురుషుడై, ఎన్ని జన్మాల నుండో గురువై, తన , ఆశయమూర్తిగా కలలుకన్న పురుషోత్తముడై తోచినారు.