పుట:Konangi by Adavi Bapiraju.pdf/198

ఈ పుట ఆమోదించబడ్డది

 నేను: కళకోసం కళ అంటే, నీలో కళ సృష్టించాలి అన్న ఆవేదన కలిగి, కళ సృష్టించడం, అంతేనా డాక్టర్?

డాక్టర్: అది అవునూ, కాదూ! కళ సృష్టించాలన్న ఆవేదన కలగకుండా, కళను ఎవ్వరూ సృష్టించలేరు. అది ఒకటి. రెండోది కళాప్రజ్ఞ కలిగి, సర్వకాలమూ సిద్దహస్తుడై ఉన్న కళాకారుని, ఫలానా విషయం ఒక శిల్పం చెక్కమనీ, ఒక బొమ్మ వేయమనీ, ఒక పాట వ్రాయమనీ అంటే ఆ కళావేత్త అది సృష్టిస్తాడు.

నేను: రెండోది కళకోసం కళ కాదుగదా?

డాక్టరు: ఓయి వెర్రివాడా! కళకోసం కళ అంటే వట్టి ఆనందం కోసం కళ సృష్టించడం అన్నమాట! నువ్వు సృష్టించే కళ ఒక ప్రయోజనం ఆర్థించకుండా ఉద్భవిస్తుంది. అలా ఉద్భవించిన తర్వాత అది ఏదయినా ప్రయోజనం నిర్వర్తింపబడవచ్చు. దానికి ఓ ఉదాహరణ ఇస్తాను. ఒక కళావేత్త తనలో కలిగిన ఆనందంచేత ఒక పళ్ళగంప చిత్రాంచాడనుకో. ఆ బొమ్మ చాలా బాగుంది. ఆది వేసేటప్పుడు ఆ కళావేత్త హృదయంలో ఏ ప్రయోజనమూ లేదు. అదే కళకోసం కళ అంటారు. తర్వాత ఒక తోటల కంపెనీవారో, పళ్ళ కంపెనీవారో వారి వస్తువుల ప్రచారం కోసం ఆ బొమ్మ కొనుక్కొని ఉపయోగించా రనుకుందాం. అప్పుడది ఒక ప్రయోజనం సంపాదించుకుందన్నమాట.

నేను: వారెవా! అయితే నాయనా! ఆ కళ పనికిరాదని యెందుకు వాదిస్తావు బాబూ?

డాక్టరు: ఓయి పెద్దమనిషీ! ఆ కళ పనికిరాదని అనను. ఆ కళ వద్దనే నా వాదన.

నేను: కొంపలు ముంచావు బాబూ!

డాక్టర్: ముంచలేదు, తేల్చాను. కళ మనుష్యులలోని ఉత్తమశక్తి. మనుష్యుని శక్తులన్నీ మనుష్యుని అభ్యుదయంకోసం ఉపయోగించాలి. అలాంటిది అది ఉత్తమశక్తి అయితే ఇంకా ఎక్కువ ఉపయోగించాలి.

నేను: ఇంక వాడికి తిండి అక్కరలేదూ? అభ్యుదయంకోసం ఉపయోగిస్తూ తన జీవితం దుబ్బులపాలు చేసుకోవాలా?

డాక్టర్: ఎంత పిచ్చిమాట నీది?

నేను: నీది నచ్చేమాట కాబోలు!

అనంతలక్ష్మీ! ఈలా ప్రారంభం అయ్యాయి మా వాదనలు. ఇవన్నీ ఊరకే వాదించడం కాదు సుమీ! నువ్వు కళా విశారదవు కావాలి. కవయిత్రివి కావాలి. నేను ఏదైనా పరిశ్రమ ప్రారంభిస్తాను. నేను రంగుల పరిశ్రమ ప్రారంభిస్తాను. గోడల రంగులు, కలప సామాను రంగులు, నూనె రంగులు, బొమ్మలకు రంగులు, ఫోటోగ్రఫీ రంగులు, రంగులు రంగులు తయారు చేస్తాను. మదరాసులో స్థాపిస్తాను. ఈ రంగుల పరిశ్రమతోపాటు కుంచెల పరిశ్రమను కూడా ప్రారంభిస్తాను. అందులో పనిచేసే కార్మికులకు ఎన్నో అధికారాలు, హక్కులు ఇస్తాను. ఆ సంస్థను గాంధీతత్వమూ, కార్మికతత్వమూ రెండూ రంగరించి ఉద్భవింప చేస్తాను.

ఇంక నీ పని సంగీతమూ, కవిత్వమూ. నీ ఉత్పష్ట సంగీత ప్రజ్ఞతోపాటు కవిత్వము వృద్ధిచేసుకుంటే, నీ నా దాంపత్యము ఈ కార్యములు నిర్వహింపగలిగిననాడు మన ఇద్దరి ప్రేమ సార్ధకమౌతుంది ప్రియా!