పుట:Konangi by Adavi Bapiraju.pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

“ఉండు; ఆ కథ అంతటితో ఆఖరా? వాళ్ళు నేను మాట్లాడక ఉండడం చూసి మరీ పేట్రేగేరు. ఒక రోజున మా పనిమనిషికి లంచం యిచ్చారు కాబోలు, వెండి వస్తువుల్ని 'ఏవేవో నాకు పంపించారు రహస్యంగా. ఇక నా కోపం చూడు, ఆ పనిమనిషి పిశాచిని పళ్ళూడగొట్టాను. ఆ వెండి వస్తువుల్ని రాతితో ముక్కచక్కలు చేశాను. “వీట్నీ చూసి వాళ్ళను బుద్ధి తెచ్చుకోమని చెప్పు. ఈ పట్టు ఇంకో తెలివి తక్కువ పని చేశారంటే పళ్ళూడకొట్టిస్తాను అని చెప్పు” అన్నాను. ఆ పనిమనిషి బేజారైపోయింది. అప్పటి నుంచీ, నాకు ఉత్తరాలు లేవు. ఇంక ఇల్లాంటి గడబిడలు జరుగలేదు. మీ చెట్టగాళ్లి కాస్త దేహ గౌరవం చేయించు. మీ వినాయగం ఉన్నాడుగా!” అంది.

“అవును, మా వినాయగం, అతని స్నేహితులూ ఉన్నారు మెహర్. కాని నాకు హింస అంటే నమ్మకం లేదు.”

“ఏమి గాంధీతత్వవాది! ఎక్కడ నేర్చుకొన్నావు ఈ వేదాంతము? యెప్పుడు ప్రవేశించావు కాంగ్రెసులో?”

“అహింసే పరమసాధనం' అని నమ్మడానికి కాంగ్రెసులో చేరాలా ఏమిటే మెహర్?”

“ఏమోలే! అయితే ఏం చేద్దామని నువ్వు చెట్టియారుగారి విషయంలో?”

“ఏమీ చెయ్యను. వాడి ఉద్దేశం నాకూ మా గురువుగారికీ ఎడబాట్లు కలుగచేద్దామని! వాడు నా గుమ్మం యెదుట కత్తితో పొడుచుకు చచ్చిపోయేది, నేను నా గురువుగారిని వదలను. నా భక్తి అలాంటిది.”

“అది మంచిదే. నీ నిశ్చయానికి నా హృదయ పూర్వకంగా నిన్ను ఆభినందిస్తున్నాను. ఇక నాకు నువ్విచ్చే సలహా ఏమిటే?”

“ఒసే మెహర్! ప్రేమ అంటే నీ ఉద్దేశంలో ఒక చీర వంటి దనుకున్నావా, మనం యిష్టం వస్తే ధరించుకొనడానికీ, బుద్ధిమారితే విప్పివేయడానికినీ? మా గురువుగారన్నట్లు ప్రేమ మనదేహంలో దేహం, మనస్సులో మనసూ, ఆత్మలో ఆత్మ అయిపోతుంది. దేహ మనఃప్రాణాల విషయంలో మనకు తెలిసి ఉండీ మనకు ముప్పు తెచ్చుకుంటున్నవట్లు, ప్రేమ విషయంలోనూ మనం తెలివితక్కువగా సంచరించి ప్రాణం మీదకు తెచ్చుకుంటాము. నువ్వు ఏమైనా రియాసత్ ఆలీగారిని విడువకు. మీ మీ రాజకీయాలు కూయంలో వేయండి.”

“ఇంత అద్భుతంగా నువ్వెప్పుడూ మాట్లాడలేదే అనంతం! నేను వెడతా. నా విషయం నేనే ఆలోచించుకోవాలి!”

“ఏమి నిర్ధారణకు వచ్చావో నాకు తెలియజేయి.”

మెహరున్నీసా వెళ్ళిపోయింది. మెహర్ రావడంవల్ల అనంతలక్ష్మికి ఎక్కడలేని ధైర్యమూ, శక్తీ వచ్చాయి.

ఆ బాలిక వెంటనే లేచి, స్నానంచేసి, ఉత్తమమయిన ఖద్దరు వస్త్రాలు ధరించి, మహిళా ఖాదీ ప్రచార కార్యాలయానికి తన కారు మీద వెళ్ళింది. జయలక్ష్మి కొమరితతో బయలుదేరక ఇంటికడనే ఉండిపోయింది. భర్తను నిర్బంధించినందుకు ఇంటికడ ఎప్పుడూ దుఃఖిస్తూ కూర్చోకుండా, భర్తకు ప్రీతియని ఖద్దరు పనిలో, మహిళా సేవాసదనోద్యమంలో పాలుపుచ్చుకుంటూ అనంతలక్ష్మి పనిచేయడం ఆమెకు ఆనందం అయింది. కొమరితను సర్వవిధాలా ఆమె ప్రోత్సహించింది.

ఆ రెండు సంస్థలకూ ఆమె బాగా విరాళాలిచ్చింది.