పుట:Konangi by Adavi Bapiraju.pdf/190

ఈ పుట ఆమోదించబడ్డది

వేసుకునేది. భారతీయ చిత్రాల ప్రదర్శనాలలో స్త్రీలకు ప్రత్యేకస్థలం ఉండేది. కనుక ఇబ్బంది ఉండేది కాదు ఆమెకు.

రియాసత్ కు పరదా అంటే పడదు. పరదా స్త్రీ పురుషులను పశువుల చేస్తుందని అతని వాదన. పరదా తీసివేయడమంటే విచ్చలవిడిగా తిరగడమని తన అభిప్రాయం కాదనీ, హిందువులు పరదా లేకుండా ఉన్నా వీధుల వెంబడి తిరుగుతున్నారా అనీ అతడు వాదిస్తాడు.

మెహరున్నీసా పరదా లేకపోతే స్త్రీ బోను విడిచిన పెద్దపులి లాంటిదంటుంది. హిందువులు, ఆంగ్లేయులు పూర్తిగా పరదా అవలంబిస్తే ముస్లింల ఆశయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారు అని వాదిస్తుంది.

6

మెహరున్నీసా, అనంతలక్ష్మీ గదిలో కూర్చుండి అనేక విషయాలు చెప్పుకున్నారు. తమ ప్రేమవిషయం మెహర్ ఒక్క అనంతలక్ష్మితోనే చెప్పుకుంటుంది. అనంతలక్ష్మి ఆమె హృదయం పూర్తిగా ఎరిగి ఉన్న బాలిక. అనంతలక్ష్మి తన ప్రేమ విషయమూ మెహర్తో తెలిపేది. వీళ్ళిఇద్దరూ తమ ప్రేమగాథలు ఒకరి కొకరు చెప్పుకునట్లు తమ ఇతర స్నేహితురాండ్రయిన బాలికలకు తెలియనీయరు. మెహర్ ఇంటికి అనంతలక్ష్మి వెళ్ళినప్పుడో, అనంతలక్ష్మి ఇంటికి మెహర్ వచ్చినప్పుడో, తక్కిన స్నేహితురాండ్రు లేనప్పుడో, వీరిద్దరూ తమ ప్రేమ విషయాలు ఎవరికయినా వినబడుతుందేమో అన్నట్టుగా గుసగుసలతో మాట్లాడుకొనే వారు.

ఆ రోజున మెహర్ తన ఆవేదన అనంతలక్ష్మికి వెళ్ళబుచ్చుకునేందుకూ, అనంతలక్ష్మి ఆవేదనను తాను భరించేందుకు వచ్చింది.

ఇద్దరూ అతిదగ్గరగా ఒకరి నొకరు కౌగలించుకొని కూర్చున్నారు.

అనంతలక్ష్మి: ఏమే మేహర్! పరీక్షలయిన తర్వాత ఇప్పుడా రావలసింది నువ్వు?

మెహరున్నీసా: మీ ఆయన ఆరెస్టు అయిన తర్వాత అన్నిసార్లు వచ్చినా, పరీక్షలయ్యాయి. నా వివాహం సంగతి మళ్ళీ తర్జనభర్జనలయ్యాయి. మా పొపీజాన్ (మేనత్తగారు) మా బాబాజాన్ (తండ్రిగారు) తో నా వివాహ విషయం తొందర పెట్టింది.

అనంత: మెహర్, నీకు కోపంవస్తే నేను చెప్పలేనుగాని, రియాసత్ ఆలీగారిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయనకు ఈ ఏటితో వైద్యచదువు పూర్తి అవుతుందిగదా!

మెహర్: అయితే మాత్రం?

అనంత: ఆయన స్వంత వైద్యం ప్రారంభించడమో, లేకపోతే కొన్ని వైద్యాలలో ప్రత్యేక పరీక్షలకు వెళ్ళడమోగదా?

మెహర్: అయితే ఏమంట? నా వివాహానికీ దీనికీ సంబంధం ఏమిటే?

అనంత: అలాంటి సమయంలో నువ్వు కూడా ఆయన దగ్గర ఉండడం మంచిదిగాదటే?

మెహర్: యేవరకే?

అనంత: మీ ఇద్దరికినూ?

మెహర్: నాకు కూడానా?

అనంత: ఆ!