పుట:Konangi by Adavi Bapiraju.pdf/188

ఈ పుట ఆమోదించబడ్డది

“ఏమీ లేదు మామా!” అనంత అన్నది.

“ఏమీ లేదేమిటి, నా తల్లీ! ఏమి జరిగింది? నిన్నటి నుంచి నువ్వదోలాగా ఉన్నావు. తల్లీ చెప్పు ఆయన వెళ్ళిపోయాడనా? తప్పక వస్తాడు. నిజం చెప్పు. అది కారణం అనుకోను!” అని రాతినైనా కరగించే ఆవేదనతో పలికినాడు.

ఆనంతలక్ష్మికి చల్లని మంచినీళ్ళు నోటి కందించినట్లయి, ఏమి బుద్ధిపుట్టిందో, అక్కడ ఆమె అలంకరించుకునే బల్లమీద ఉన్న ఆఉత్తరాల వైపు చేయి చాపింది."

“ఆ చిన్నడ్రాయరులో ఇంకో ఉత్తరం ఉంది. అది కూడా చదువు మామా!”

వినాయగంపిళ్ళ ఆ ఉత్తరాలు మూడూ చదివాడు.

అతనికి కుస్తీలో ఒక భయంకరమైన పేచీలో ప్రత్యర్థి చిత్తుచేసినంత అఘాతం కలిగింది. అతని ఆలోచన మాయమయింది. అతని గొంతు కేండి పోయింది. నిస్తబ్దుడై అలా నిలుచుండిపోయాడు.

అనంతలక్ష్మి వినాయగం అవస్థ చూచి మరీ నిసృహ పొందింది.

ఏమో నిజమేమో, తన గతి ఇంక అధోగతే! తాను బ్రతికి ప్రయోజనం లేదు.

ఏమో నిజమేమో! నిజమే! నిజమే అయివుండాలి! కాదు, ఇదంతా మోసం. తప్పకుండా మోసం. అనంతలక్ష్మి గజగజ వణికింది. నూట నాలుగు డిగ్రీల మలేరియా వచ్చినట్లు వణికిపోయింది.

5

వినాయగంపిళ్ళ తమ అమ్మిణిని కష్టపెట్టిన ఆ చెట్టియారును తలచుకొంటూ ఉగ్రుడై పోయాడు.

వినాయగం పేరు పొందిన వీరుడు. మల్లయుద్దంలో రామానయినా ఎదిరించ దగినంత వీరుడు. అతని కండశక్తీ నరబలమూ జగత్ర్పసిద్దము. ఉక్కుకడ్డీలు విరుగుతాయి. అతని అవయవాలు విరగవు. అతనికి కోపం రాదు. అతనికి ఆవేశం లేదు. ప్రకృతిశక్తికి పాఠాలు చెప్పే శక్తి అతనిది.

ఇప్పటికీ వినాయగంపిళ్ళ దగ్గర కుస్తీలు నేర్చుకోవడానికి అనేకులు శిష్యులు వస్తూ ఉంటారు. అతడు కోడి రామమూర్తిగారి సర్కసులో రంగూను, చీనా, జపాను, మలయా, జావా, మొదలయినవన్నీ తిరిగాడు. కోడి రామమూర్తి అతనికి గురువు. తన గురువునకు బాటసగా అతడు ఎన్ని బలప్రదర్శనాలన్నా చూపించేవాడు. ప్రసిద్ధి కెక్కిన దక్షిణాది గురువుల దగ్గర మల్లవిద్య నేర్చుకొని రామమూర్తి సర్కసులో ఉండే రోజుల్లో గామా దగ్గర అనేకమయిన నూతన మల్లయుద్ధ ప్రయోగాలు (పేచీలు) నేర్చుకొన్నాడు. గామా వేగానికి సమానమయిన వేగం అతనిది. గామారి తదితర శిష్యులు అతనితో కుస్తీ పోటీపడడం అంటే భయపడతారు.

అలాంటి వినాయగంపిళ్ళకు నేడు దావానలంవంటి కోపం ఉద్భవించింది. “అమ్మిణీ! ఈ ఉత్తరాలు నేను నమ్మను. నీ పెళ్ళి యింకా వారం రోజులు ఉందనగా నేనూ, మా వాళ్ళూ కలిసి జాగ్రత్తగా కోనంగిరావుగారిని గూర్చి విచారించాము. నా స్నేహితుణ్ణి ఒకర్ని బందరు పంపించి దర్యాప్తు చేశాము. కోనంగిరావుగారంత మంచివారు ఇంకొకరు లేరు. చెట్టికి వినాశకాలం వచ్చింది. వాడు చేసినపని ఇదంతా! ఇది ఏమనుకున్నాడో? మేము ముగ్గురము ఇక్కడ ఉన్నామన్న సంగతి మరచిపోయాడు. మాకు