పుట:Konangi by Adavi Bapiraju.pdf/186

ఈ పుట ఆమోదించబడ్డది

అలాంటి సంసారం వలలో నువ్వు పడ్డావు. బోగంవాళ్ళు బోగంవాళ్ళే! యెన్ని గంగాస్నానాలు చేసినా ఊరకుక్క నందినీధేనువు అవుతుందా? అది గౌరవంకోసం నిన్ను పెళ్ళిచేసుకుంది.

డాక్టరు రెడ్డికీ అనంతానికీ జయలక్ష్మికి ఏదో ఉండేదనేవారు. నా కావిషయం అంత నమ్మకంలేదుగాని, అనంతం నా చాటున గూడా కొందరు కాలేజీ కుఱ్ఱవాళ్ళ దగ్గర తన్ను అర్పించుకొని డబ్బు కొట్లో ఉండేది. ఆ విషయం దీనితో జతపర్చిన ఉత్తరం చదివితే బోధపడుతుంది. మిమ్మల్ని చూసి జాలివేసి పట్టలేక ఈ ఉత్తరం వ్రాశాను.

మీరు సినీమాలో సంబంధం కలిగి ఉన్న సినీమా తారలు ముగ్గురూ కులాసాగా ఉన్నారు. మిమ్ము మరీ మరీ అడగమన్నారు.

4

ఆ ఉత్తరం చూడగానే కోనంగికి అంతులేని కోపం వచ్చింది. ఎంత విషం ఈ సెట్టియారుకి! “ఖలునకు నిలువెల్ల విషము గదరా సెట్టీ!” అని అనుకున్నాడు. తన్ను తాను మరిచిపోయేటట్లు చేయగలడు సెట్టి. ఇంకా కావాలంటే కొన్నాళ్ళకు కోనంగి వట్టి గుండా అని సంపూర్ణ నమ్మకం కోనంగికే కలుగచేయగలడు సెట్టి అని అతడనుకున్నాడు.

తనకు ఉత్తరం వ్రాసినట్టుగానే, అనంతానికి కూడా ఉత్తరాలు వ్రాస్తున్నాడా? ఏమి వ్రాశాడా? దాని ఫలితమేమో తెలిసేదెట్లా? ఈ పిశాచి ఉద్దేశం ఏమిటి? పెళ్ళి కాకమునుపు ఈలాంటి పనులు చేసి ఉంటే కొంచెం సెట్టికి ఉపయోగపడి ఉండునేమో! ఇంక తన ఆనందం విచ్ఛిన్నం చేయాలనేగా వీడు ప్రయత్నించేది? తన్ను కొట్టించాడు ఆ దెబ్బతో తాను చచ్చినా దిక్కెవరు?

స్త్రీకోసం పురుషపుంగవులు ఎంతైనా చేస్తారు. ధనం కోసం, తిండి కోసం దొంగతనాలు, దోపిళ్ళు. హత్యలు చేయడం అర్థం అవుతుంది. వివాహంకోసం ఎన్నో తాపత్రయాలు పడవచ్చును! కాని స్త్రీని పొందడంకోసం మాత్రం పురుగుకన్న హీనుడూ, నరమాంసభక్షకునికన్న భయంకరుడూ కావాలా? ఒక స్త్రీని ప్రేమించి ఆస్తీకోసం ఎంత బీభత్సం చేసినా కొంత అర్థం ఉంది. ఎవరో ఒక స్త్రీని కామించి, తన పశుతృప్తి తీర్చుకోడానికి ఎంత పనికయినా వెరవకుండా ఉండడము సంపూర్ణ పశుకృత్యంకన్న - ఎంత నీచస్థితోగదా అని కోనంగి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు.

ఈ ఉత్తరం డాక్టరు రెడ్డికి చూపించడమా, చూపించక పోవడమా? తన అనంతం వ్రాసిన ఉత్తరం రెడ్డికి చూపించడమా, చూపించక పోవడమా? తన అనంతం వ్రాసిన ఉత్తరం రెడ్డికి చూపించనివాడు ఇప్పు డీ ఉత్తరం చూపించడంలో అర్థమేమి ఉంది? అని అత డాలోచించుకున్నాడు.

అక్కడ అనంతలక్ష్మి ఉత్తరం రెండవసారి చూచుకొని, దాన్ని ముక్కలు ముక్కలు చించివేద్దామని అనుకొంది. కాని ఈ ఉత్తరం అవసర మయితే పనికివస్తుందని దాన్ని దాచింది."

ఆ మర్నాడే రెండు ఉత్తరాలు కోనంగిరావు పేర అనంతలక్ష్మి ఇంటి చిరునామాకు వచ్చాయి. అనంతలక్ష్మి ఆ కవరులు రెండూ తన ఉత్తరంతో పాటు కోనంగికి పంపాలని సంకల్పించి విప్పి చూచింది.