పుట:Konangi by Adavi Bapiraju.pdf/159

ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే జరిగాయి ఆ రాత్రి శోభనమందిర ప్రథమ సంధాన దినపు వేడుకలు. చదువుకున్న పిల్లలు అల్లరి చేయడం మొదలు పెట్టితే ఆపే వారెవరు?

వధూవరులు ఆపలేరు, వాళ్ళలో వాళ్ళు ఆపుకోలేరు. జయలక్ష్మి ఏమంటుంది. కోనంగి అనంతలక్ష్మికి అత్తరు రాయాలి. అనంతలక్ష్మి కోనంగికి అత్తరు రాయాలి. ఒకరి కొకరు గంధాలు రాయాలి. అల్లరిగా బుగ్గలమీద రాయాలి. పన్నీరు చల్లించారు. ఇద్దరూ ఒకరి మెళ్ళో ఒకరు పూలదండలు వేయాలి. కోనంగి అనంతలక్ష్మి తల్లో పూవులు ముడవాలి. అనంతలక్ష్మి కోనంగి ఖద్దరు పట్టుచొక్కా గుండీకి పూలగుత్తి తగిలించాలి.

ఇద్దరూ తొమ్మిది చొప్పున తమలపాకుల చుట్టలు కొరికి వధువు వరుని నోట్లోకి, వరుడు వధువు నోట్లోకి అందివ్వాలి.

వీళ్ళు తమలంకూడా నోటికి నోటితో అందివ్వమంటారేమో దైవమా అని కోనంగి భయపడ్డాడు.

పార్వతి: నమలవే అనంతం!

మీనాక్షి: నమలండీ కోనంగిరావుగారూ!

కోనంగి: నములుతున్నా నమ్మా, నములుతున్నాను.

అంబుజం: మింగివేయకండి కోనంగిరావుగారూ!

మీనాక్షి: ఆ తమ్మ -

అనంతలక్ష్మి: మీనాక్షి!

పార్వతి: ఎందుకమ్మా మీనాక్షి? మీరు ఒకరి కొకరు తమ్మ అందియ్యాల? చేతులతో కాదండీ కోనంగిరావుగారూ!

కోనంగి: ఒక పాట రాసుకువచ్చాను. పాడమంటారా?

అందరూ: తప్పకుండా! అభివందనాలు.

మీనాక్షి: ఆ తర్వాత అనంతం ఓ పాట పాడాలి!

కోనంగి:

ఆకాశ దూరాల కంతేది చివరేది?

హృదయామృతము రుచికి

పదములల్లే దెవరు?

ఈ కొండ నోవాగు ఆ కొండనోవాగు

రెండు వాగులు కలియు

ప్రేమ క్షేత్రంబేది?

ఆనంద డోలికాయానాన కంతేది?

ఆర్ధకంఠంలోని ఆలాప నేరూపు?

చీకటిలో చీకటి చేరినట్లేవరెరుగు?

వెలుగు వెలుగున చేరు విధము ఎరిగిన దెవరు?

అంబుజం: ఏమిటిబాబూ ఈ వేదాంతం? కాని పాడడం దివ్యమే!

అందరూ: అద్భుతంగా ఉంది.

మీనాక్షి: నీ వంతో అనంతం!

అనంతం: నాకు వచ్చిన పాటలు కృతులే!

అంబుజం: కృతులకూ, ఇప్పటికీ శ్రుతి కలవదే!