పుట:Konangi by Adavi Bapiraju.pdf/128

ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యంకాదు. అనంతలక్ష్మిని అనుభవించడమే అతడు కోరేది. ఆ బాలిక భార్య అయితే అందంలేదు. భార్యలు చప్పబడి పోతారు. మనకు కావలసినప్పుడు వెళ్ళి ఒక అందమైన బాలికను అనుభవించడంలో ఉన్న బ్రహ్మానందం ఆమెను భార్యను చేసుకోవడంలో ఎక్కడ నుంచి వస్తుంది? అది లేనిపోని తద్దినం నిష్కారణంగా నెత్తిన తెచ్చి పెట్టుకోవడమే!

వెల ఇచ్చి అనుభవించే స్త్రీలు నిజమైన ఆనందం ఇవ్వలేరు. వాళ్ళల్లో ధనం ఎక్కువ పుచ్చుకొనేవాళ్ళు ఉండవచ్చుగాక! కాని వాళ్ళు బజారులో వస్తువుల వంటివారు. అందరానిపండుకు ఆశించి, ఆ పండును కోరి కోరి, కష్టపడి సంపాదించుకొని, అనుభవించడంలోనే ఆనందం, మహదానందమూ ఉన్నాయి. అదీ చెట్టియారుగారి వ్యక్తిత్వం అని కోనంగి ఏనాడో అర్థం చేసుకున్నాడు.

"చెట్టియారుగారి చరిత్రలు కథలుగా సినీమా లోకంలో చెప్పుకోడం కోనంగి బాగా విన్నాడు. ఊం కొట్టాడు. అతడు సినిమా తారలకోసం ప్రాకులాడుతూంటే ఎవరికీ నష్టంలేదు. కాని పండంటి కాపురాలు చెడగొట్టడమూ, ఏమీ ఎరగని బాలికలను అధోగతిలోకి కూలదోయడమూ, సినీమాలలో ఏదో ఒలుకుతుందని కానీ, ఏదో తారుమారు చేద్దామనిగాని, బీదతనంచే కుళ్ళిపోయి అది నాశనం చేసుకొని, తలెత్తి బ్రతుకుదామనిగాని, బాలికలు కొత్తగా సినిమా ప్రపంచంలో అడుగుపెట్టితే, ఆ మాయాలోకంలో మన చెట్టియారువంటి ఉదార హృదయులూ, అతి గొప్పనటకులూ పొంచివుండే పెద్దపులులై ఆ బాలికలను కబళించి వేస్తారు. అక్కడే సినీమాలోని విషాదాంత నాటిక ప్రారంభ నాందీశ్లోకం పాడుతుంది అని కోనంగికీ దృఢతరమైన నమ్మకం కలిగింది.

మన చెట్టియారుగారు ఎన్ని సినీమా కంపెనీలలోనో భాగస్వామిగా ఉన్నాడంటే ఇదే రహస్యం. ఆయన స్త్రీ వాంఛ అడవుల్ని అడవుల్ని ఆహుతికోరే దావానలం. ఆయన పురుషత్వం ఎప్పుడూ స్త్రీలు అనే జడివానలను కోరే భయంకరమైన ఎడారి. అతని పురుషత్వం వృకోదరం! అతని పురుషత్వం ఎంతో లోతు ఉన్న దొంగ ఊబి.

అతనికి జయలక్ష్మిగాని, అనంతలక్ష్మిగాని అందకపోవడం పెద్ద తలవంపు లయిపోయింది. అతని ‘షరం' మచ్చపడింది. అతని ‘ఇజ్జత్' విరిగి పోయినట్లయింది. అతని గౌరవం, మర్యాదా మంటకలిసిపోయాయి. అతని సిగ్గు చిట్టిబండలపాలయింది.

అందుకని చెట్టియారుగారు జయలక్ష్మిపై కత్తికట్టాడు. అనంతలక్ష్మి తండ్రి రంగయ్యంగారు మంచి న్యాయానుభవం కలవాడు. అందరిలోనూ తెలివైనన్యాయవాదుల నాయకులు ఆయనకు మిత్రులు. తన ఆస్తి సంపూర్ణ హక్కులతో జయలక్ష్మికీ, అనంతలక్ష్మికీ మరణశాసనం వ్రాసినాడంటే, అన్ని కట్టుదిట్టాలు చేయకుండా వ్రాస్తాడా? రంగయ్యంగారు పోయి అరేళ్లు కాకుండా వ్యాజ్యం తెచ్చారు. అంతవరకు చెట్టియారుగారు జాగ్రత్తవంతులే. చరాస్తికి దఖలు దస్తావేజులు శ్రీనివాసఅయ్యంగారు రాసి ఇచ్చాడుట. నగలు అవీ కొనడం అన్నీ జయలక్ష్మీ పేరునే, ఆయన రాసిన ఉత్తరాలన్నీ జయలక్ష్మిని భార్యగా ఎంచే రాసినారు. అందుకని చరాస్తిపై వ్యాజ్యం వేయలేకపోయాడు. జయలక్ష్మికి ఇప్పుడు నలభయినాలుగేండ్లు. రంగయ్యంగారికీ జయలక్ష్మీకీ ఇరవైఏళ్ళ సంబంధం! అయ్యంగారు ఏ అవుసరపు పనులకు తన భూముల గ్రామాలకు వెళ్ళినప్పుడో తక్క జయలక్ష్మిని వదలి ఉండలేదు.

రంగయ్యంగారి విల్లు చెన్నపట్నంలో వ్రాశారు. న్యాయవాదుల సలహా సంప్రతింపులలో ఆ విల్లు రిజిష్టరయింది. అది తర్వాత న్యాయస్థానంలో అనుమతింప బడింది. ఆ ప్రకారమే ఆస్తి అంతా జయలక్ష్మికి దఖలుపడింది.