పుట:Konangi by Adavi Bapiraju.pdf/116

ఈ పుట ఆమోదించబడ్డది

"ఆ ప్రశ్న నీ కెందుకు కలిగింది? నాటకంలో ప్రేమ నిజమైన ప్రేమ అనుకున్నారా మీరు?”

“ఒకమాటు 'మీరు' ఒకసారి 'నువ్వు' మార్చకండి. నన్ను “నువ్వూ' అంటేనే మంచిది.”

“నన్ను గౌరవంచేస్తూ మాట్లాడితే నేనూ అలాగే మాట్లాడుతున్నాను.” “నేను భార్యను. నన్ను మీరు గౌరవం చేయకూడదు.”

“మళ్ళీ భార్య అంటారేమిటి? సరే కానియ్యి. నువ్వే అంటాను. అంతమాత్రంవల్ల నేను మొద్దు తలకాయను కానులే. ఇంక ఏమిటీ?”

“నా మొదటి ప్రశ్నకి జవాబియ్యరేం?”

“మొదటి ప్రశ్నా? నీ మొదటి ప్రశ్నా? ఏమిటదీ? అవునవును. నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అని కాదూ? ఉహూఁ? ఏమీ ప్రేమించడం లేదు.”

“అయితే ఈ ప్రశ్న విషయంలో కొంత చర్చ చేయాలి.”

“ఏమి టా చర్చ?”

“ఏముంది! ఎందుకు ప్రేమించడంలేదు. చేయకపోతే, ఇప్పటికి నాల్గయిదు నెలలనుంచి ప్రేమిస్తున్నట్లు ఏలా అభినయం చేయగలిగినారు? మొట్టమొదట నన్ను ప్రేమించటంలేదని నాకు స్పష్టంగా తెలిసింది. అప్పటి మీ అభినయం అర్థమయింది నాకు.”

“తర్వాత అంతే! మొదట అభినయం చేయడం నాకు చేతకాదు, తర్వాత చేయగలిగాను. అదే తేడా!”

“ఆబద్దాలాడకండి! ఈ విషయం అంతా మా ఇంటిదగ్గిర చర్చించు కుందాం రండి!”

ఆ బాలిక ఇంటికి ఎలాగో తాను వెళ్ళడమూ, అక్కడ ఆ అమ్మాయి అప్సరసలా వేషం వేసుకుని తన్ను సుడిగుండంలా కౌగిలించుకోవడమూ అయింది. అతనికి మొదట ఆశ్చర్యము, తరువాత కొంచెం రక్తం ఉడుకెత్తడమూ జరిగింది. అతడు బ్రహ్మాండముమీద ఆమె కౌగిలి వదిలించు కొని, ఎలాగో ఆమెతో వాదించి, ఆమెకు మనస్సు మార్చ ప్రయత్నం చేయడం అన్నీ కోనంగి జ్ఞాపకం తెచ్చుకొన్నాడు.

“వాణీదేవీ! నువ్వు కామవాంఛాపూరిత జన్మవు. నేను కాను. నా కామవాంఛ నా భార్యవల్లనే తీరాలి. నీ కామవాంఛ ఎవరివల్ల నైనా తీర్చుకోగలవు. అది నాకేమీ సరిపడదు.”

కోనంగిరావుగారూ! ఎప్పుడూ నన్ను ఇతరులు పాంఛించడమూ, వారి కోర్కె నేను తీర్చడమూ, అందుకు వేలకువేలు వారు సమర్పించడమూ జరుగుతోంది. ఈ మధ్యనే మన కంపెనీలో ఏభైవేల రూపాయల ధనం పెట్టి డిస్టిబ్యూటరుగా చేరిన నాటుకోటిసెట్టిగారు, మీతో కూడా ఎంతో చనువుగా మాటాడుతారే-ఆయన నాకు పదివేలు ఇస్తాను, నెలరోజులు తనతో ఉండమన్నారు.”

“ఆ సెట్టిగారు నీ దగ్గిరా చేరారూ?”

“ఏమి లాభం? నేను ఒప్పుకోలేదు. ఆయన బ్రతిమాలాడు. డబ్బు ఎక్కువ చేస్తానన్నాడు. ఏభై వేలదాకా బేరం వృద్ధి చేశాడు.

“నువ్వు?”

“ఒప్పుకోలేదు!"